రెబ్బెన, జూన్ 26 : ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన భూ తగాదాకు ఇద్దరు బలయ్యారు. కర్రలు, గొడ్డళ్లతో పరస్పరం దాడలు చేసుకోవడంతో మహిళతో పాటు మరొకరు మృత్యువాత పడగా, నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం జక్కులపల్లిలో సోమవారం సంచలనం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షులు, పొలీసుల కథనం ప్రకారం.. జక్కులపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ముల కొడుకులు మండల నాగయ్య, మండల భీమయ్య. భీమయ్యకు కుమారులు బిచ్చం, బక్కయ్య, దుర్గయ్య, బొందయ్య, కుమార్తె గిరుగుల బక్కమ్మ ఉన్నారు.
నాగయ్యకు కొడుకులు బాపు, మల్లేశ్, మెంగయ్య ఉన్నారు. గ్రామ శివారులోని 109 సర్వే నంబర్లో ఉన్న 12 ఎకరాలు, సర్వే నంబర్లోని 111లో ఉన్న 7 ఎకరాల భూములు భీమయ్య, నాగయ్యకు వారసత్వంగా వచ్చాయి. వీటికి పట్టాలు కూడా ఉన్నాయి. 12 ఎకరాలను అన్న దమ్ములకు సమానంగా పంపకాలు చేయగా, మిగతా 7 ఎకరాలను సమానంగా పంచలేదు. 20 ఏళ్లుగా భూములన్నీ బీళ్లుగా ఉన్నాయి. నాలుగు నెలల క్రితం భీమయ్య వారసులు వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధపడగా, నాగయ్య వారసులు అడ్డుపడ్డారు. సమానంగా పంపకాలు జరిగేదాక వ్యవసాయం చేయవద్దని చెప్పారు. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. సమస్యకు పరిష్కారం దొరకలేదు.
ఈ క్రమంలో ఆదివారం బక్కయ్య, దుర్గయ్య, బక్కమ్మ భూమిని దున్ని పత్తి విత్తనాలు వేశారు. విషయం తెలుసుకున్న మల్లేశ్, మెంగయ్య, బాపు కుమారుడు గణేశ్‌తో పాటు బంధువు పెంటయ్యతో కలిసి సోమవారం చేను వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకున్న బక్కయ్య, బక్కమ్మ భూమి వద్దకు వెళ్లగా, ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. కర్రలు, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకోగా, బక్కయ్య కుమారుడు నర్సయ్య (32), బక్కమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. బక్కయ్య, పెంటయ్య, మల్లేశ్, మెంగయ్యలకు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ శ్రీనివాస్ ఘర్షణకు గల కారణాలు తెలుసుకున్నారు. సీఐ నరేందర్, ఎస్ఐ భూమేశ్ కేసు నమోదు చేశారు.