మంచిర్యాలటౌన్, జనవరి 9 : పట్టణంలోని మార్కెట్రోడ్లోగల క్వాలిటీ బేకరీ నుంచి పాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కార్యాలయం వరకు నవంబర్లో చేపట్టిన పెద్ద కాలువ తవ్వకం, పూడ్చివేతకు అయిన ఖర్చు అక్షరాలా రూ. రెండు లక్షలు. అసలు ఎందుకు తవ్వారో, ఎందుకు పూడ్చారో తెలియని ఈ తతంగానికి మున్సిపాలిటీ జనరల్ఫండ్ నుంచి రూ. రెండు లక్షలను అప్పగించేందుకు కౌన్సిల్ అంగీకరించింది. పైగా ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ల మౌఖిక ఆదేశాలతోనే అంటూ ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. ఆక్రమణలు, ఎలక్ట్రికల్ కేబుళ్లు తొలగించడం కోసమని ఎజెండాలో పొందుపరిచారు.
ఈ నెల ఆరో తేదీన జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చి ఆమోదించేశారు. నవంబర్లో చేపట్టిన కాలువ తవ్వకాలపై ఎవరికీ ఎలాంటి అవగాహన లేకపోగా, ఎవరినీ అడిగినా తమకు తెలియదని మున్సిపల్ అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. తీరా ఇందుకు సం బంధించిన బిల్లు ఎజెండాలోకి రావడంతో అందరూ అవాక్కయ్యా రు. అసలు ఈ కాలువ ఎందుకు తవ్వుతున్నారు, ఇక్కడ ఏం నిర్మిస్తారు, దేనికోసం అన్న విషయాలు ఆ సమయంలో రహస్యంగా ఉన్నాయి. ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ముందుగా నిధులు కేటాయింపు, టెండరు పిలవాల్సి ఉంటుంది. కానీ, అవేమీ లేకుండానే ఇక్కడ కాలువ తవ్వకం మొదలు పెట్టారు.
మళ్లీ అదే కాలువను పూడ్చివేశారు. ఈనెలలోనే పాలక వర్గం పదవీకాలం ముగుస్తుండడం, చివరాఖరుగా నిర్వహించిన సమావేశంలో ఇష్టారీతిన బిల్లులు పెట్టారన్న వాదనలు వినిపిస్తున్నా యి, అంతకుముందు డిసెంబరులో నిర్వహించిన సమావేశంలో కూడా మోటర్ల మరమ్మతులు, సబ్మెర్సిబుల్ మోటర్ల ఏర్పాట్లు, మరమ్మతుల పేరిట పెద్ద ఎత్తున బిల్లులు పెట్టినట్లు సమాచారం. తమ వార్డులో సబ్మెర్సిబుల్ మోటర్లు రిపేరు చేయలేదని కొందరు, అసలు కొత్త మోటర్లు పెట్టలేదని కొందరు కౌన్సిలర్లు అంటున్నారు. ఇంటర్ లింక్ పైపులైన్ కనెక్షన్లు కూడా ఇవ్వలేదని పలువురు కౌన్సిలర్లు చెబుతున్నారు. ఈ అంశాలపై పూర్తిస్థాయిలో లోతైన దర్యాప్తు చేపట్టాలని ప లువురు ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.