ప్రత్యేక ప్రతినిధి, మే 12(నమస్తే తెలంగాణ) : వేద ఘోషతో మార్మోగాల్సిన బాసర సరస్వతీ పుణ్యక్షేత్రంలో వేద పాఠశాల విద్యార్థులకు నెత్తుటి, చావు ఘోషలు వినిపిస్తున్నాయి. సరస్వతీ సాక్షిగా వేద పాఠశాలలో ఓ విద్యార్థిపై దాడి.. అనుమానాస్పద స్థితిలో మరో విద్యార్థి మృతి కలకలం రేపుతుంటే.. విచారణలో అలసత్వం ప్రదర్శించడంపై అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీ వేద భారతీ పీఠంలో విద్యార్థి లోహిత్‌పై దాడి జరిగి దాదాపు 50 రోజులు పూర్తయ్యింది. మరో విద్యార్థి మణికంఠ మృతి చెంది 40 రోజులు దాటింది. వరుస ఘటనలు సరస్వతీ క్షేత్రానికి కలంకం తీసుకొస్తున్నా.. వీటికి కారకులైన వారిని ఇప్పటి దాక ఎందుకు అదుపులోకి తీసుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మణికంఠ మృతి నేపథ్యంలో స్వామిజీపైనే అనుమానం ఉందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
లోహిత్‌కు ఏమైందో తేలాల్సిందేనంటూ వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ రెండు ఘటనల్లో అనుమానితులుగా ఉన్న వేద పాఠశాల నిర్వాహకుడు వేద విద్యానందగిరి స్వామిజీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తనకేమీ సంబంధం లేదన్నట్లు కేసులను త్వరగా విచారించాలని, చట్ట ప్రకారం నిందితులను శిక్షించాలని కోరారు. బాసర గ్రామస్తులు వేద విద్యార్థులకు న్యాయం చేయాలని, కారుకులైన వారు ఎవరైనా సరే వదిలిపెట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు కావస్తున్నా ఈ రెండు కేసుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం, ఇంత రచ్చ జరుగుతున్నా పోలీసులు, జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేద విద్యార్థులపై దాడుల కేసుల్లో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వేద పాఠశాలలో మార్చి 19వ తేదీ రాత్రి లోహిత్‌పై దాడి జరిగింది. మరుసటి రోజు తెల్లవారుజామున సంధ్యావందనం చేసే సమయానికి లోహిత్‌ను గుర్తించినట్లు చెప్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే వేద పాఠశాల సీసీ టీవీ కెమెరాలు ఆఫ్ అయ్యాయి. అంటే ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే కీలక ఆధారం లేకుండా జాగ్రత్త పడ్డాకే అటాక్ జరిగిందనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. మరుసటి రోజు మార్చి 20వ తేదీన బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు వచ్చి రాత్రి 8.30 గంటలకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసే దాకా… పోలీసులు ఆ పక్కకు కూడా వెళ్లకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. మరుసటి రోజు ఉదయం భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్ వచ్చి విచారించారు.
పోలీస్ డాగ్ కూడా ఘటన స్థలంలో తిప్పారు. లోహిత్ గాయాలతో ఎక్కడైతే కనిపించాడో ఆ చుట్టూ పక్కల ప్రాంతాల్లో పోలీస్ డాగ్ తిరిగినా ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిసింది. వెపన్తో నరికితే పక్కనున్న గోడలపై రక్తం పడాలి. కానీ.. గోడలపై రక్తపు మరకలు లేవని, బయట ఎక్కడో దాడి చేసి ఇక్కడికి తెచ్చి పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. బయట దాడి చేసి ఉంటే పోలీస్ డాగ్ పాఠశాల పరిసరాలు దాటి ఎందుకు బయటికి రాలేదు. పాఠశాల లోపలే తిరిగితే దాడి చేసిన వెపన్ ఏమైనా దొరకాలి కదా? కానీ.. ఇవేవి దొరక్కపోవడం చర్చనీయాంశంగా మారింది.
మరుసటి రోజు భైంసా ఏఎస్పీసహా జిల్లా ఎస్పీ జానకీ షర్మిల వేద పాఠశాలకు వచ్చారు. ఐదారు గంటలు అక్కడే ఉండి వేద పాఠశాల నిర్వహకులు, విద్యార్థులను ఒక్కొక్కరిని రెండు సార్లు వేరువేరుగా ప్రశ్నించినా.. అందరూ భట్టీ పట్టినట్లు ఒకే సమాధానం చెప్పినట్లు సమాచారం. తొలిరోజు విచారణంలో భాగంగా పాఠశాల నిర్వాహకులైన వేద విద్యానందస్వామి, ఆయనతోపాటు ఉండే ఓ మాతాజీని పోలీసులు బాసర పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణ కోసమని తీసుకెళ్లిన వారిని గంటసేపు కూడా ఉంచుకోకుండానే వదలిపెట్టినట్లు తెలిసింది. ఇలా చేయడం ఇక్కడ అనుమానాలకు తావిస్తున్నది.
రెండు రోజుల విచారణలో ఆధారాలు దొరకనప్పటికీ పాఠశాలకు సెలవులు ఇచ్చి పిల్లలందరినీ ఇంటికి ఎందుకు పంపారు. సీసీ టీవీలను స్విచ్ ఆఫ్ చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదు? దాడికి వాడిన వెపన్ ఎందుకు రికవరీ చేయలేదు? విద్యార్థి బంధువులు వచ్చి కేసు పెట్టే దాకా విచారించకుండా పోలీసులు ఎందుకు ఎదురు చూశారు.. ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. కేసు విషయంలో ముందు నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరించి చివరకు గాయపడిన లోహిత్ కోలుకొని ఏం జరిగిందో చెప్తే తప్ప ఏం చేయలేం అంటూ చేతులు ఎత్తేయడం విమర్శలకు తావిస్తున్నది.
లోహిత్ కేసులో ఒకే ఒక్క ఆధారంగా ఉన్నది విద్యార్థి బండారి మణికంఠ. గాయాలపాలై రక్తపు మడుగులో పడి ఉన్న లోహిత్‌ను ముందు చూసింది తనే. ఆ రోజు రాత్రి పాఠశాలలో ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉన్న ఏకైక వ్యక్తి మణికంఠ ఏప్రిల్ 4వ తేదీన విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు. నిత్య హారతి ఇచ్చే గోదావరి ఘాట్‌ను శుభ్రం చేసేందుకు నీళ్ల కోసమని మణికంఠను బలవంతంగా గోదావరిలో ఉండే మోటార్ దగ్గరకు పంపారనే ఆరోపణలు ఉన్నాయి. మణికంఠ మోటార్‌కు వైర్ బిగించే సమయంలో స్విచ్ ఆన్ చేయడంతో కరెంట్ షాక్‌కు గురై ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోటార్ బాగు చేసేందుకు వెళ్తే దాన్ని బాగు చేసి బయటికి వచ్చే వరకు స్విచ్ వేయకూడదు.
కానీ.. మోటార్ దగ్గర ఉండగానే స్విచ్ వేయడం ఏంటన్నది అర్థం కాకుండా పోయింది. కాగా.. ఈ కేసులో ముగ్గురు నిజామాబాద్ అమ్మాయిలు ఐ విట్నెస్గా ఉన్నట్లు తెలిసింది. మణికంఠ గోదావరిలోకి వెళ్తుంటే చూశామని, షాక్‌తోనే చనిపోయాడని వాళ్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కానీ.. అదే సమయంలో పుష్కరఘాట్‌లో ఉన్న మాతాజీ తండ్రి, అతని మనవడు, పాఠశాలకు చెందిన మరొకరిని వాళ్లు ఎందుకు చూడలేదన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. మణికంఠ మోటార్ దగ్గర ఉండగా స్విచ్ ఆన్ చేసినోళ్ల గురించి ఈ కేసులో ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవనే ఆరోపణలున్నాయి.
ఈ కేసులో నిర్లక్ష్యం కారణంగా మృతి అని కేసు నమోదు చేసిన పోలీసులు ఐ విట్నెస్లు ఉన్నారని, అది ప్రమాదమేనని తేల్చి కంక్లూజన్‌కు వచ్చేసినట్లు అనిపిస్తున్నది. మణికంఠ మోటర్ దగ్గర ఉన్నప్పుడు మోటర్ స్విచ్ వేసింది ఎవ్వరు.. వారికి ఎందుకు పోలీసులు పట్టుకోలేకపోయారో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. పైగా ఈ కేసులో ముందు నుంచి పోలీసులు సెటిల్మెంట్ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మణికంఠ మృతి చెందిన రోజు ఏప్రిల్ 4న బాసర ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహం ఉంచారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి మరుసటి రోజు ధర్నా చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కానీ.. పోలీసుల ప్రోద్బలంతోనే భైంసాలో మాట్లాడుకునేందుకు వెళ్లినట్ల సమాచారం.
భైంసాలో స్వామిజీ శిష్యులు మణికంఠ కుటుంబ సభ్యులకు రూ.లక్ష అంత్యక్రియల కోసం ఇచ్చినట్లు తెలిసింది. అదయ్యాక ఏప్రిల్ 13వ తేదీన మణికంఠ తల్లిదండ్రులను పిలిచి డీల్ మాట్లాడినట్లు సమాచారం. బాసర శ్రీరామ లాడ్జిలో కాసేపు మాట్లాడాక, స్థానికంగా ఉంటే ఇబ్బందని చెప్పి భైంసాకు తీసుకెళ్లి చర్చలు చేసినట్లు స్థానికులు చెప్తున్నారు. అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి కేసులో నయానో.. భయానో ఇచ్చి కేసే లేకుండా చేసేందుకు ప్రయత్నాలు సాగుతుంటే.. పోలీసులు మిన్నకుండిపోవడం ఏంటన్నది అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు.