మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 24 : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు కదం తొక్కారు. ఈ మేరకు శుక్రవారం మూడో రోజూ మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట మూతికి నల్ల గుడ్డలు కట్టుకుని, మౌనదీక్ష చేపట్టి నిరసన తెలిపారు. అనంతరం నర్సంపేటలో ఆత్మబలిదానం చేసుకున్న డ్రైవర్ శంకర్‌గౌడ్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బొట్టు లక్ష్మణ్, తోట సత్తయ్య, సుదర్శన్ మాట్లాడుతూ సమ్మెకు కారణం ప్రభుత్వమేనని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు దిగినా విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రైవేట్ వాహనాలను నడిపిస్తూ.. తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లోకి తీసుకుంటున్నారన్నారు. నైపుణ్యత లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని డిమాండ్ చేస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీని అమలు చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నామన్నారు. సమ్మెలో పాల్గొన్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మబలిదానానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దీనిని ప్రభుత్వ హత్యగా భావించి సంబంధిత మంత్రిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బీఆర్ఎస్ నాయకుల మద్దతు
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికారు. శుక్రవారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన శిబిరంలోకి వెళ్లాలని ప్రయత్నించగా, ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులనే బయటకు పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సర్కారు వ్యవహరిస్తున్న తీరు దారుణమని, నర్సంపేటలో డ్రైవర్ శంకర్గౌర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, మరో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారని, ఇందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శంకర్‌గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని, కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని అడుగుతున్నారని, ప్రస్తుత కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తున్నదని అన్నారు. కనీసం కార్మికుల నిరసన దీక్ష శిబిరం దగ్గరకు తమను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. టెంట్లు వేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదంటే ఇదెక్కడి పాలన అని ప్రశ్నించారు. వందరోజుల్లోనే ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి రెండున్నరేండ్లు గడిచినా పట్టించుకోకపోవడం సరికాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, అంకం నరేశ్, పెట్టెం లక్ష్మణ్, పడాల రవీందర్, పెంట ప్రదీప్, అహ్మద్ పాల్గొన్నారు.

Adilabad
ఆసిఫాబాద్‌లో నిరసన ర్యాలీ
ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 24 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు నిరసన ర్యాలీ తీశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ వివిధ రాజకీయ పార్టీ, ప్రాజా సంఘాల నాయకులతో కలిసి ఆత్మబలిదానం చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన వీదుల గుండా ర్యాలీ తీశారు. ఉపేందర్ మాట్లాడుతూ కార్మికుడి ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
అనుభవం లేని తాతాలిక డ్రైవర్స్ వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టింపులకు పోయి అమాయకులైన ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపి సమ్మె విరమణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మారెట్ కమిటీ చైర్మన్ మంగమ్మ,విశాల్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు చిరంజీవి, ఆర్టీసీ చైర్మన్ అశోక్, మంజుల, కవిత, ప్రవీణ్, సుధాకర్, లక్ష్మణ్, ఎజాజ్, దేవి కుమార్, ఆర్పీ సింగ్ పాల్గొన్నారు.
శాంతియుతంగా సమ్మె కొనసాగించాలి : ఎస్పీ నితికా పంత్
ఆర్టీసీ కార్మికులు సమ్మెను శాంతియుతంగా కొనసాగించాలని ఎస్పీ నితికాపంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు చేపట్టిన సమ్మె శిబిరాన్ని సందర్శించారు.
కొవ్వొత్తుల ర్యాలీ
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి సంతాప సూచకంగా శుక్రవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండు నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకూ మంచిర్యాల ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. శంకర్‌గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బొట్టు లక్ష్మణ్, తోట సత్తయ్య, సుదర్శన్, ఉమారాణి, పాల్గొన్నారు.