ఎదులాపురం, డిసెంబర్ 18 : వన్యప్రాణుల వేట పేరిట అమాయక గిరిజనులను అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు గోడం గణేశ్ అన్నారు. బుధవారం అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు హోరెత్తించారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ ఎస్ఐ ఇసాక్ సిబ్బంది కలిసి అకడి చేరుకుని కార్యాలయంలోకి వెళ్లకుండా గేట్లను మూసి వేశారు. ఈ సందర్భంగా గోడం గణేశ్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన మేకల కాపరి మడావి రామకృష్ణని జంతువును వేటాడాడనే నెపంతో ఉదయం తీసుకొచ్చి నీరు, ఆహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు.
అటవీ శాఖ అధికారులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎఫ్ఆర్వో గులాబ్ సింగ్ వివరణ ఇచ్చారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని సిరికొండ గ్రామానికి మేకల కాపరి నీలుగాయిని వేటాడాడని తమకు అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇచ్చారన్నారు. దీని ఆధారంగానే మడావి రామకృష్ణని విచారణ నిమిత్తం తీసుకొచ్చామన్నారు. విచారణలో జగన్నాథ్ స్టేట్మెంట్ తీసుకున్నామని తెలిపారు. విచారణ సమయంలో ఆదివాసీ సంఘాల నాయకులు ఆందోళనలు చేయడం సరికాదన్నారు.
బలవంతంగా ఎవరిపై కూడా కేసులు నమోదు చేయమని స్పష్టం చేశారు. విచారణలో తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని పేరొన్నారు. ధర్నాలో తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వేట్టి మనోజ్, కొల్లామ్ సంఘం రాష్ట్ర నాయకులు కొడప సోనేరావు, జిల్లా విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు ఆదిలాబాద్ సలాం వరుణ్, రైతు సంఘం డివిజన్ అధ్యక్షుడే ఆత్రం బుజంగ్ రావు, మావల మండల అధ్యక్షుడు మేడమా ముకుంద్, మడవి బాపూరావు, మెస్రం దినేశ్, గేడం ఆనంద్, గేడం గణేశ్ ఉన్నారు.