ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ ( Asifabad ) జిల్లా కేంద్రంలోని సర్కార్ దవాఖానాలో జ్వరంతో ఓ గిరిజన యువకుడు ( Tribal Youth ) సోమవారం మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందించక పోవడం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన ( Protest ) నిర్వహించారు.
ఆసిఫాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గుడిగుడి గ్రామానికి చెందిన ఆత్రం రాంషావ్ (25) తీవ్ర జ్వరంతో బాధపడుతూ శనివారం సాయంత్రం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. రాత్రి అతని పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించడంతోనే మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఆస్పత్రిలో చేర్పించిన అరగంట వరకు వైద్యసిబ్బంది ఎవరు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది సకాలంలో వైద్యం అందించి ఉంటే మృతి చెందేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోట్నాక విజయ్ కుమార్ సోమవారం జిల్లా ఆసుపత్రి ఎదుట నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వలన ఇంకా ఎంత మంది చనిపోవాలని ప్రశ్నించారు. ఇప్పటికే జిల్లా ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని, పేరుకే పెద్ద ఆసుపత్రి .. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు.. కేవలం ప్రథమ చికిత్సలకే పరిమితం అవుతుందని మండిపడ్డారు.