నెన్నెల : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని (Nennela Mandal ) పలు గ్రామాలను విష జ్వరాలు ( Fever ) వణికిస్తున్నాయి. జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెన్నెల, నందులపల్లి, మన్నెగూడెం, గన్పూర్, మైలారం గ్రామాలలో జ్వరాలతో ప్రజలు ములుగుతున్నారు. నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిత్యం పదుల కొద్దీ జ్వరాలతో వచ్చి చికిత్స పొందుతున్నారు.
ఆరోగ్య కేంద్రంలో ఆరు బెడ్లు మాత్రమే ఉండగా రోగులతో నిత్యం నిండిపోతున్నాయి. జ్వరాలతో వచ్చిన రోగులకు రక్త నమునాలు తీసుకొని పరీక్షించే టెక్నీషియన్ లేక ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లవలసి వస్తుందని రోగులు ఆరోపించారు. ల్యాబ్ టెక్నీషియన్ లేకసంవత్సరం దాటిందని, అప్పటి నుంచి రోగులకు ఇక్కడ రక్త పరీక్షలంటే తెలియదు.
అవసరంనుకుంటే మంచిర్యాల టీ హబ్‌కు రక్త నమూనాలు పంపి చేతులు దులుపు కుంటున్నారు. స్థానికంగా పరీక్ష చేస్తే అప్పటికప్పుడు ల్యాబ్ టెస్ట్ లను చూసి మందులు తీసుకొనే వారమని రోగులు వాపోయారు. రోగమేందో తెల్వకపోతే ఇక మందులు ఎందుకని పేర్కొన్నారు. ఈ విషయంపై డాక్టర్ లక్ష్మణ్‌ను సంప్రదించగా ఆసుపత్రికి వస్తున్న రోగులకు సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.
పలు గ్రామాల్లో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి జ్వర పీడితులకు మందులు ఇస్తున్నట్లు తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ లేక పరీక్ష చేయలేక పోతున్నామని, అవసరం ఉన్నవారికి రక్త నమూనాలు తీసుకొని టీ హబ్ కు పంపించి పరీక్షలు చేయిస్తున్నామని వివరించారు.