ఇంద్రవెల్లి, మార్చి 30 : ఇంద్రవెల్లి మండలంలోని గిన్నేరా గ్రామ పంచాయతీ పరిధిలో గల తోయగూడ గ్రామానికి చెందిన ఆదివాసులు బిందెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నారు. తోయగూడలో 30 ఉమ్మడి కుటుంబాలు ఉండగా 300లకు పైబడి జనాభా ఉంటారు. గతంలో తాగునీటి కోసం అధికారులు కొలాంగూడకు చెందిన ఓ వ్యవసాయ భూమిలో బోరు వేసి అక్కడి నుంచి పైపులైన్ సాయంతో నీటిని అందించారు. చేతిపంపులతోపాటు బోరుబావులు అడుగంటి పోయాయి.
మిషన్ భగీరథ పథకం సరిగా పని చేయకపోవడంతో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం చుట్టూ పక్కల గ్రామాల నుంచి నీటిని తీసుకొస్తున్నారు. బిందెడు నీటి కోసం కొన్ని కిలోమీటర్ల మేర వెళ్తున్నారు. నీటి ఎద్దడితో పెళ్లి వేడుకలు నిర్వహించాలంటే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.
బోర్ మంటున్నాయ్..
తాగునీటి సమస్యను అధికారులు పరిష్కరిం చాలి. చుట్టూ పక్కల గ్రామాల్లోని చేతిపంపుల నుంచి బిందెడు నీళ్లు తెచ్చుకుంటున్నాం. గ్రామానికి చెందిన మిషన్ భగీరథ పథకం సరిగా పని చేయడం లేదు. గ్రామంలో నీటి సమస్యలు ఉండడంతో పెళ్లి వేడుకలు నిర్వహించేందుకు చాలా భయమేస్తున్నది. ఇంటికి బంధువులతోపాటు చుట్టాలు, ఎవరైనా వస్తే వారికి నీళ్లు ఇవ్వలేని దుస్థితి ఉంది. అధికారులు నీటి అవస్థను తీర్చాలి.
– కనక లింగు, తోయగూడ.