మంచిర్యాల, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు వర్షాకాలమంటేనే వణుకు. వాగులు.. వంకలు ఉప్పొంగి బాహ్యప్రపంచంతో రోజుల తరబడి సంబంధాలు తెగిపోతాయనేది వారి భయం. ఒక్కసారి భారీ వాన పడిందా ఇక దినదిన గండమే. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల వాసులంతా ‘వానలు రావద్దు దేవుడా’.. అని కోరుకుంటుంటారు. దశాబ్దాలుగా అనేక గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన కేసీఆర్ సర్కారు రవాణా వ్యవస్థ మెరుగుపర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు అనేక గ్రామాలకు రోడ్లు, వంతెనలు నిర్మించింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో 80కి పైగా వాగులు, వంకలపై బ్రిడ్జిలు నిర్మించడమేగాక మరికొన్ని గ్రామాలకు నిధులు కూడా మంజూరు చేసింది.
అయితే, అటవీ అనుమతులు లేక నిర్మాణాల్లో జాప్యం జరిగింది. ఇక ఆపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మారుమూల గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాలన్న విషయాన్నే పట్టించుకోవడం లేదు. దీంతో ఈ యేడాది కూడా ఆయా గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పేలా లేవు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కోటపల్లి మండలం రాజారం గ్రామపంచాయతీ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన విషయం విదితమే. చివరకు అధికారులు దిగివచ్చి చర్చలు జరపడంతో వారంతా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. నక్కలపల్లి గ్రామానికి రోడ్డు వేసేందుకు నిధులు మంజూరైనా అటవీశాఖ అనుమతులు లేక రోడ్డు, వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడం లేదు. ఇక పారుపల్లి-లింగన్నపేట గ్రామాల మధ్యనున్న వాగుపై రూ.3 కోట్ల 8 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతుండగా, నేటికీ పనులు పూర్తి చేయలేదు. దీంతో ఈ మార్గంలో ఉన్న 10 గ్రామాల ప్రజలకు కష్టాలు తప్పేలా లేవు.
ఈ వానకాలంలో కూడా రాజారం గ్రామస్తులకు కష్టాలు తప్పేలా లేవు. రాజారం గ్రామానికి రెండు మార్గాలుండగా, కేసీఆర్ ప్రభుత్వం పారుపల్లి నుంచి కావరకొత్తపల్లి గ్రామం వరకు ఉన్న 5 కిలో మీటర్ల రోడ్డుకు రూ.3 కోట్ల 3 లక్షలు, బబ్బెరచెలుక నుంచి రాజారం వరకు 3 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 2 కోట్ల 3 లక్షలు మంజూరు చేయించింది. కాగా, అటవీ అనుమతులు లేని కారణంగా ఈ రో డ్డు పనులు నిలిచిపోగా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాకాలం ఈ మార్గం మొత్తం బురదమయం అవుతుండడంతో కాలినడక కూడా కష్టం అవుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. 1125 మంది గ్రామస్తులు ఉండే ఈ గ్రామం పై చిన్నచూపు చూస్తుండడం వల్ల తమకు వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని చెబుతున్నారు. ఈ గ్రామంలోని విద్యార్థులు పై చదువులు చదవాలంటే ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బబ్బెరచెలుక గ్రామానికి కాలినడకన వెళ్లాల్సి వస్తుంది. ఈ మార్గంలో వాగు ఉండడం వల్ల, అది ఉప్పొంగినప్పుడల్లా ప్రాణాలకు తెగించి స్కూల్కు వెళ్లాల్సి వస్తున్నదని విద్యార్థులు చెబుతున్నారు.
కోటపల్లి మండలం నక్కలపల్లికి రోడ్డు నిర్మాణానికి అటవీ అనుమతులే ప్రధాన అడ్డంకిగా నిలిచాయి. మల్లంపేట నుంచి నక్కలపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.6 కోట్లు, మార్గమధ్యలో ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 2.95 కోట్లు, మరో బ్రిడ్జికి రూ.2 కోట్ల 3 లక్షలను కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేయగా, అటవీ అనుమతులు లేక రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం పడకేశాయి. గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న మట్టి రోడ్డు వర్షాకాలం బురదమయం కావడంతో వర్షాకాలం నక్కలపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలతో పాటు బద్దంపల్లి, చాపనపల్లి, బొమ్మెన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వర్షాలు పడితే ఈ మార్గంలో ఉన్న వాగులు ఉప్పొంగితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ఎక్కడివారక్కడే ఉండాల్సి వస్తోంది. రోడ్డు, వాగుల పైన బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ఈ మార్గంలో ఉన్న ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.
కోటపల్లి మండలం పారుపల్లి-లింగన్నపేట గ్రామాల మధ్య ఒర్రెపై రూ.3 కోట్ల 8 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. ఇది పూర్తి కాకపోతే అవతల ఉన్న 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉంది. బ్రిడ్జి పక్క నుంచి తాత్కాలిక రహదారి ఏర్పాటు చేసినప్పటికీ వర్షం పడితే బురదమయమైన ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ మార్గంలో లింగన్నపేట, ఎదుల్లబంధం, సిర్సా, పుల్లగామ, ఆలుగామ, రొయ్యలపల్లి, జనగామ, నందరాంపల్లి, సూపాక, వెంచపల్లి గ్రామాలు ఉండగా, ఈ రోడ్డు ద్వారానే రాకపోకలు సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగితే& వర్షాలు పడి తాత్కాలిక రోడ్డు బురదమయమయితే ఎటు వాహనాలు అటే ఉండాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. ప్రస్తుతం చిన్న వర్షం పడినా ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోతున్నాయి.
మా ఊరికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మస్తు తిప్ప లైతంది. మా బడి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తం 30 మంది విద్యార్థులం నడుచుకుంట బడికి వెళ్తం. చిన్నపాటి వర్షం పడినా మా ఊరి వాగు ఉప్పొంగుతది. నీళ్లు పారినన్ని రోజులు బడికి బందే. ఎన్నోసార్లు వాగు తగ్గే దాకా ఒడ్డువద్ద గంటల తరబడి ఎదురు చూసినం. ఇకనైనా సార్లు కల్పించుకొని మా ఊరి రోడ్డు తొందరగా పూర్తి చేయాలి. అప్పుడే మా కష్టాలు తీరుతయి.
– వైష్ణవి, విద్యార్థిని, రాజారం
మా ఊరికి రోడ్డు, బ్రిడ్జి నిర్మించేందుకు ఎప్పుడో నిధులు మంజూరైనయి. అటవీశాఖ అనుమతులు లేక పనులు చేస్తలేరు. దీంతో మా ఊరితో పాటు పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు కూడా మస్తు తిప్పల పడుతున్నరు. వాగులు ఉప్పొంగితే గంటల తరబడి ఎక్కడి జనాలు అక్కడే ఉండాల్సి వస్తుంది. రోడ్డు, వాగుల పైన బ్రిడ్జి లేకపోవడంతో మా గ్రామానికి అత్యవసర పరిస్థితులలో 108 ఆంబులెన్స్ కూడా రాని పరిస్థితి ఉంది. ఇకనైనా సార్లు చొరవ తీసుకొని తొందరగా పనులు పూర్తి చేయాలి.
– ఈగం లచ్చయ్య, నక్కలపల్లి