తాండూర్ : బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఏరియా వర్క్ షాప్‌లో పనిచేస్తున్న టెక్నీషియన్లను కైరిగూడ ఓపెన్ కాస్ట్‌కు డిప్యూటేషన్ ( Deputations) పై పంపడాన్ని రద్దు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS ) బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాసరావు( Srinivas rao) డిమాండ్ చేశారు.
గురువారం టీబీజీకేఎస్ నాయకులతో కలసి ఆయన ఏరియా వర్క్ షాప్‌ను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. అనంతరం ఏరియా వర్క్ షాప్ డీవైజీయం జ్ఞానేశ్వర్‌ను కలిసి ఏరియా వర్క్ షాప్ నుంచి బదిలీ చేసిన టెక్నీషియన్ల బదిలీలు రద్దు చేయాలని కోరారు. ఏరియా వర్క్ షాప్ ను బలోపేతం చేయడం కోసం జనరల్ మేనేజర్‌తో మాట్లాడి టెక్నీషియన్లను పోస్టింగ్ చేయించాలని సూచించారు. ఎలక్ట్రిషన్, ఫిట్టర్ల కొరత ఉన్నదని ఎంవీ డ్రైవర్ ను కూడా ఇంకొకరిని పోస్టింగ్ చేయాలని కోరారు.
ఈ సందర్భంగా డీవైజీఎం స్పందిస్తూ జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉన్న 15 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఏరియా వర్క్ షాప్ నుంచి కార్మికులను తీసివేయలేదని వర్క్ షాప్‌కు ఎలాంటి సమస్య వచ్చిన ముందుండి పోరాటం చేసి ఆపామని గుర్తు చేశారు.
ప్రస్తుతమున్న గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సెక్రటరీ ఓరం కిరణ్, వర్క్ షాపు ఫిట్ కార్యదర్శి గాజవేని శ్రీనివాస్, ఏరియా స్టోర్ పిట్ కార్యదర్శి గణపతి, కమిటీ సభ్యులు వైకుంఠం, రెడ్డి సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.