నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్ 8 : మహిళా సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధికి స్త్రీనిధి ద్వారా సర్కారు రుణాలు ఇస్తున్నది. ఈ రుణాలను సంఘాల సభ్యులు చెల్లిస్తుండగా.. ఆర్పీలు మాత్రం ప్రభు త్వ ఖాతాలో జమ చేయడం లేదు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన మెప్మా పీడీ సుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ముథోల్ ఇన్స్పెక్టర్ సంజీవ్ మెప్మా కార్యాలయంలో మంగళవారం అధికారులు, సిబ్బందిని విచారించాడు.
పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాల చెల్లింపులను బ్యాంకులో జమ చేయడంలో ఆర్పీలు అవకతవకలకు పాల్పడినట్లు తేల్చారు. ప్రాథమికంగా రూ.82 లక్షల వరకు దుర్వినియోగం అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. విచారణలో భాగంగా పీడీ సుభాష్, స్త్రీనిధి ఆర్ఎం సరితను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులైన సైరాభాను, కవిత, జ్యోతి, రజిత, విజయలపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. అధిక మొత్తంలో దుర్వినియోగం అయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా.. ఈ కేసుపై లోతుగా విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.