కడెం/ఖానాపూర్ టౌన్/దస్తురాబాద్, ఫిబ్రవరి 22: అటవీ అధికారులకు శిక్షణ సమయం ఎంతో కీలకమని హైదరాబాద్ ధూలపల్లి శిక్షణ అకాడమీ చైర్మన్ రాంమోహన్, కడెం ఎఫ్ఆర్వో చోలె అనిత అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి 50 మంది శిక్షణ ఎఫ్‌బీవోలు కవ్వాల్ అభయారణ్యంలో పర్యటించారు. మంగళవారం ఉదయం ఖానాపూర్ రేంజ్ కార్యాలయానికి చేరుకొని అక్కడ పలు అంశాలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి దస్తురాబాద్ మండలంలోని ముఖ్యమంత్రి హరిత వనం, ఆకొండపేట చెరువు (గడ్డి క్షేత్రాన్ని), ఫొటో గ్యాలరీని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నాటిన లక్ష మొక్క ల వివరాలు, సంరక్షణకు తీసుకున్న చర్యలపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కడెం మండలంలోని గంగాపూర్ వాచ్‌టవర్ వద్దకు చేరుకున్నారు. వాచ్‌టవర్ ఉపయోగాలపై అధికారులు శిక్షణ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ రాంమోహన్, కడెం ఎఫ్ఆర్వో చోలె అనిత మాట్లాడుతూ…అటవీ ప్రాంతాల సంరక్షణ కోసం అధికారులు నిరంతరం శ్రమించాలని, ప్రధానంగా బేస్‌క్యాంపు సిబ్బందితో కలిసి పని చేసే పలు అంశాలను వివరంగా తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపదను కాపాడడం వంటి వాటితో పాటు, మొక్కల ఉపయోగాలను వారికి తెలియజేశారు. కల్పకుంట అటవీ ప్రాంతానికి చేరుకొని వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ అధికారులు ఏర్పాటు చేసిన గడ్డి క్షేత్రాన్ని పరిశీలించారు. ఖానాపూర్ రేంజ్ పరిధిలోని గ్రానైట్ టింబర్ డిపోను ట్రైనీ ఎఫ్‌బీవోలు పరిశీలించారు. కడెంలో ఎఫ్‌బీవోలు ఎంఏ అలీం, శివశంకర్, ఖానాపూర్‌లో ఎఫ్‌డీవో కోటేశ్వర్రావు, ఎఫ్ఆర్వో వినాయక్, దస్తురాబాద్ ఎఫ్‌బీవోలు హలీం, లక్ష్మీనారాయణ, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
కవ్వాల్ అభయారణ్యం పరిధిలో శిక్షణ తీసుకోవడం ఆనందంగా ఉంది. ఈ ప్రాంతంపై కొంత పట్టు ఉన్నప్పటికీ అటవీ ప్రాంతాల్లోకి క్షుణ్ణంగా వెళ్లి జంతు వుల సంరక్షణ, అటవీ సంపదను కాపాడే పలు అంశాలు నేర్చుకోవడం ఆనం దంగా అనిపించింది. అధికారులు పూర్తిగా అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తు న్నారు. విధుల్లో సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగప డుతుందని అనుకుంటున్నా. – జీ గీతా, ఎఫ్‌బీవో, మందపెల్లి (పెంబి మండలం)
కవ్వాల్ టైగర్ రిజర్వు ప్రాంతాన్ని సందర్శించి పలు అంశాలను తెలుసుకున్నాం. ఫీల్డ్‌లో నిత్యం చేసే పనుల విషయమై అధికారులు వివరించడం, అలాగే అటవీ సంరక్షణకు తీసుకునే చర్యలను వివరించారు. ఇది మాకు భవిష్యత్‌లో ఎంతో ఉపయోగపడుతుందనుకుంటున్న. జంతువుల సంరక్షణ, అటవీ సంపదను కాపాడడం, అటవీ ప్రాంతంలో పర్యటించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. విధుల్లో భాగంగా ఎన్నో అంశాలను మాకు చెప్పారు. ఈ పర్యటన చాలా సంతోషంగా సాగింది. -లావుడ్య ఊహ, ఎఫ్‌బీవో, సోనాల (బోథ్ మండలం)
మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. నేను అటవీ శాఖలో ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డా. అటవీ ప్రాంతంలో పని చేయడం మహిళలకు ఎంతో దైర్యం కావాలి. అటవీ సంరక్షణతో పాటు, బేస్‌క్యాంపు ఏర్పాటు, వాచ్‌టవర్, సోలార్, సాసర్ఫీట్స్ లాంటి వాటిని తెలుసుకున్నా. ఏ రంగంలో రాణించాలన్నా ధైర్యంతో ముందడుగేయాలి. అప్పుడే మనం రాణించగలుగుతాం. ఇక్కడి అటవీ ప్రాంతం చాలా బాగుంది.
– వైష్ణవి, ఎఫ్‌బీవో, దేవాపూర్ (మంచిర్యాల)
ప్రాథమిక స్థాయి నుంచి మొక్క సంరక్షణకు తీసుకోవాల్సిన అంశాలు చాలా బాగా నేర్పించారు. ఒక్కో మొక్క ఎలా ఉపయోగపడుతుంది..నీటి సౌకర్యం ఎలా అందించాలి అనే అంశాలు కొత్తగా అనిపించాయి. శిక్షణ ఎంతో బాగా అనిపించింది. దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించడం ఎంతో సంతోషంగా అనిపించింది. రానున్న రోజుల్లో విధుల్లో భాగంగా మేం ఎలా ముందుకెళ్లాలో ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది.
-ఎండీ సాధిక్, ఎఫ్‌బీవో, కాగజ్‌నగర్