సిర్పూర్(టీ), జూన్ 19 : సిర్పూర్(టీ)-కాగజ్నగర్ ప్రధాన రహదారిలోని వేంపల్లి గ్రామ సమీపంలోగల రైల్వే గేటు బుధవారం ఉదయం సాంకేతిక కారణాలతో మొరాయించింది. ఫలితంగా గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
సిర్పూర్(టీ)తో పాటు కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జుర్ మండలాలతో పాటు మహారాష్ట్రకు వెళ్లే రహదారి కావడంతో గేటుకు ఇరువైపులా కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది మరమ్మతు చేసిన తర్వాత వాహనాలు కదిలాయి. ఏళ్లకేళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేసి, ప్రయాణాలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.