తాండూర్ : ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు ( Traffic rules ) పాటించాలని తాండూర్ సీఐ దేవయ్య ( CI Devaiah ) వాహనదారులకు సూచించారు. మంగళవారం తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలైన బ్లాక్ స్పాట్లను ( Block Spots ) ఎస్సై డీ కిరణ్ కుమార్తో కలిసి సందర్శించారు. అనంతరం జాతీయ రహదారిపై సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు , వాహనాల వేగాన్ని తగ్గించేందుకు అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రోడ్డు మధ్యలో లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధిత అధికారులకు సమాచారం అందించామని వివరించారు. జాతీయ రహదారి సమీపంలోని గ్రామాల ప్రజలు రోడ్డును నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే దాటాలని, పశువులను రోడ్లపైకి విడిచిపెట్టరాదని సూచించారు.
ఫోర్ వీలర్స్ డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ను ధరించాలని , ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. అనంతరం నంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలకు, బ్లాక్ స్టిక్కర్, హెల్మెట్, రాంగ్ రూట్లో వస్తున్న వాహనాలకు జరిమానా విధించారు.