చింతలమానేపల్లి, డిసెంబర్ 1 : మహారాష్ట్రలో పత్తిని వ్యాపారులు, దళారులు తక్కువ ధర కొని.. అక్రమంగా మన రాష్ట్రానికి తరలించి ఇక్కడి సీసీఐ కేంద్రాల్లో అధిక ధరకు విక్రయిస్తూ జోరుగా దందా సాగిస్తున్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని అహేరి తాలూకాలో కొనుగోలు చేసి సరిహద్దులోని కుమ్రం భీం అంతర్రాష్ట్ర బ్రిడ్జి మీదుగా మన రాష్ట్రంలోకి తీసుకువస్తున్నారు.
మహారాష్ట్రలో పత్తి ధర ప్రైవేట్‌గా రూ.6000 నుంచి 6500 వరకు దళారులు, వ్యాపారులు కొనుగోలు చేసి సరిహద్దుల్లో తెలంగాణ జిల్లాలకు తరలిస్తున్నారు. ఇక్కడి సీసీఐ కేంద్రాల్లో కనీస మద్దతు ధర రూ. 8100 విక్రయిస్తూ దందా జోరుగా సాగిస్తున్నారు. ఇక్కడ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా ఈ దందా సాగుతుండడం గమనార్హం. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో రెవెన్యూ, పోలీస్, అగ్రికల్చర్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ఇతర రాష్ర్టాల నుంచి వరి ధాన్యం రాకుండా చెక్‌పోస్టు వద్ద సిబ్బందిని నియమించగా పోలీస్ యంత్రాంగం పశువుల అక్రమ రవాణా, పీడీఎస్ రైస్ రవాణా జరుగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం చెక్‌పోస్టులో సిబ్బంది అందుబాటులో ఉంచడం లేదని తెలుస్తున్నది. దీంతో డ్యూటీలో ఉన్న అధికారులు, సిబ్బంది సైతం పత్తి లోడు వచ్చినట్లు ఎంట్రీ చేసుకొని వదిలేస్తున్నారు. మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన మార్కెట్ సెస్ కూడా ఎగనామం పెడుతున్నారు. ఈ అక్రమ దందాతో ప్రభుత్వ ఖజానా నష్టం జరుగుతున్నది. గూడెం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా మహారాష్ట్ర నుంచి పశువుల రవాణా, మహారాష్ట్రకు పీడీఎస్ రైస్, బెల్లం రవాణా రాత్రి వేళల్లో సాగుతున్నట్లు స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ రవాణా అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.