కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధి బట్టబయలైంది. రైతు వ్యతిరేక పార్టీ అని రుజువైంది. నీచ రాజకీయాలు కూడా తేటతెల్లం అయ్యాయి. ఆదరణ కోల్పోయిన ఆ పార్టీ అన్నదాతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఎందుకు? మూడు గంటలు సరిపోదా.. అని కర్షకులపై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు. ఈ వ్యాఖ్యలతో అప్పట్లో పెద్ద దుమారమే లేసింది. తాజాగా.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే యాసంగికి సంబంధించి రైతుబంధు, దళితబంధును కూడా ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)కి లేఖ రాయడంపై రైతన్నలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ సర్కారు ఇస్తుంటే.. కాంగ్రెస్ నాయకులకు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు.
– ఆదిలాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడ్డాం. విత్తనాలు, ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తిన్నాం. కరెంటు కోతలతో చేతికొచ్చిన పంట నష్టపోయాం. సాగునీరు లేక, కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేసేవారు దిక్కులేక దళారులకు తక్కువ ధరకు అమ్ముకున్నాం. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు, పంటల కొనుగోళ్లతో వ్యవసాయం లాభసాటిగా మారింది. రైతుబంధు ఆపాలని కాంగ్రెసోళ్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉంది. రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం.
– వెంకట్‌రెడ్డి, రైతు, కజ్జర్ల, తలమడుగు
ఆదిలాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో విత్తనాలు మొదలుకుని పంట విక్రయించేంత వరకు రైతులు అష్టకష్టాలు పడేవారు. ఎరువుల కోసం ఆందోళనలు చేసి పోలీసుల లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఉండేది. పెట్టుబడికి బ్యాంకుల్లో అప్పులు పుట్టక అధిక వడ్డీలతో బాకీలు తీసుకొచ్చి సాగు చేసేవారు. నకిలీ విత్తనాలతో దిగుబడి వచ్చేది కాదు. కరెంటు కోతలకు చేతికి వచ్చిన పంటలు ఎండిపోయేవి.
అహర్నిశలు కష్టపడి సాగు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు దిక్కులేకపోవడంతో దళారులకు తక్కువ ధరకు విక్రయించి రైతులు నష్టపోయేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సం క్షేమ పథకాల ఫలితంగా వ్యవసాయం పండుగలా మారిం ది. ఎరువులు, విత్తనాల పంపిణీ, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ప్రభుత్వం రంగ సంస్థల ద్వారా పంట కొనుగోళ్లు లాంటివి రైతన్నను రాజుగా మార్చాయి. ఉన్నత చదువులు చదువుకుని ఇతర ప్రాంతాల్లోని కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు తమ సొంత గ్రామాలకు తిరిగొచ్చి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధిని ప్రదర్శిస్తున్నది. రైతుల ఆదరణ కోల్పోయిన ఆ పార్టీ అన్నదాతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదని, కేవలం మూడు గంటలు ఇస్తే సరిపోతుందని అన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ మరోసారి రైతులకు తన అక్కసును ప్రదర్శించింది.
ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాయడంపై జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం భీంస రి, బేల ఇతర మండలాల్లో కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్‌కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని అన్నదాతలు అంటున్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలి సి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్ రైతులు, నాయకులతో కలిసి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెల దామోదర్‌రెడ్డి, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. భీమారం మండల కేంద్రంలోని మంచిర్యాల – చెన్నూర్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెఱుకు సరోత్తమారెడ్డి నాయకులు, రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మను దహనం చేశారు.
భూమిని నమ్ముకుని చేమటోడ్చి పంట సాగు చేసే రైతులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తున్నది. రైతుబంధును ఆపమని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారులకు లేఖ రాయడం వారి దుర్భుద్దికి నిదర్శనం. ఏళ్లుగా పెట్టుబడికి అప్పులు చేస్తున్న రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నారు. సర్కారు వ్యవసాయ రంగానికి అమలు చేస్తున్న పథకాల ఫలితంగా రైతులు సంతోషంగా ఉన్నారు. పంటలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలతో కొనుగోలు చేస్తూ ఆదుకుంటున్నది. అప్పుల బాధలు లేకుండా రైతులు రెండు పంటలు సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఎవరూ ఆదరించరు.
– దప్కల గజానన్ యాదవ్, రైతు, గుబిడి, భీంపూర్ మండలం