ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లాగా పేరుగాంచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా అభివృద్ధి ప్రత్యేక దృష్టి సారించింది. ఫలితంగా అభివృద్ధిలో ఆదిలాబాద్ ఇతర జిల్లాలతో పోటీ పడుతున్నది. బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో ఐటీ రంగం క్రమంగా విస్తరించగా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటైన రెండు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా.. 300 మంది యువత ఉపాధి పొందుతున్నారు. జిల్లాలోని ఇంజినీరింగ్ చదువుకున్న యువతతోపాటు రాష్ట్రంలో ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఉపాధి కల్పించడానికి బీఆర్ఎస్ మూడేండ్ల కిందట మూడెకరాల్లో రూ. 40 కోట్లతో మంజూరు చేసింది. రెండు వేల మంది యువతకు ఉపాధి కల్పించే ఐటీ టవర్ పనులు పూర్తి కాగా ప్రారంభానికి సిద్ధమైంది.
– ఆదిలాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ)
ఉమ్మడి రాష్ట్రంలో వెనకబడిన జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ఐటీ రంగాన్ని విస్తరించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి జోగు రామన్నలు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించడంతో హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలకు పరిమితమైన ఐటీ కంపెనీలు ఆదిలాబాద్లో ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం కంపెనీల ఏర్పాటుకు అవసరమైన సాయం అందించారు. బీఆర్ఎస్ సర్కారు అందించిన సహకారంతో ఆదిలాబాద్లో ఐదేండ్ల కిందట ఐటీ కంపెనీ ప్రారంభం కాగా మూడేండ్ల కిందట మరో కంపెనీ ప్రారంభమైంది.
జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటైన ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఐటీ కంపెనీలు ప్రారంభంకాక ముందు ఉన్నత చదువులు అభ్యసించిన యువత ఐటీ కంపెనీల్లో పనిచేయడానికి హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పుడు సొంత జిల్లాలో మంచి వేతనాలతో పేరుగాంచిన కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ రంగం విస్తృత పర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. మావల మండలంలోని బట్టిసవర్గాంలో గల సర్వే నంబరు 72లో మూడెకరాల స్థలంలో రూ.40 కోట్లతో ఐటీ టవర్ను నిర్మాణాన్ని చేపట్టింది. అన్ని హంగులతో 68 వేల చదరపు అడుగుల వైశాల్యంలో జీ ప్లస్ ఫోర్ భవనాన్ని నిర్మించింది. అంచనా వ్యయం పెరుగగా ప్రస్తుతం ప్రభుత్వం మరో రూ.10 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఐటీ టవర్ నిర్మాణం పూర్తికాగా ప్రారంభంలో మాత్రం జాప్యం జరుగుతున్నది.
ఉద్యోగులు 24 గంటలు పనిచేసేందుకు, సమావేశాలు నిర్వహణతోపాటు కిచెన్, డైనింగ్, పార్కింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. టవర్ ప్రారంభమైతే 2 వేల మందికి ఉపాధి లభిస్తుండగా మూడు షిప్టుల్లో ఒక్కో షిప్టుకు 660 మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉంది. ఆదిలాబాద్ ఐటీ టవర్లో తమ కార్యకలాపాలు నిర్వహించడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్న ప్రారంభ కాకపోవడంతో యువత ఉపాధికి దూరం కావాల్సి వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ టవర్ను తొందరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని యువత కోరుతున్నారు.