కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావాసులు వర్షాకాలం వచ్చిందంటే నరకం అనుభవిస్తున్నారు. మామూలు వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసినప్పుడు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. వాగులు ఉప్పొంగినప్పుడు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు. వాగులపై వంతెనలు లేకపోవడంతో చిన్నపాటి వర్షాలకే రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. దాదాపు నాలుగు నెలలపాటు బిక్కుబిక్కు అంటూ తండాలు, గూడేల్లోనే ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రహదారులపై దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు అవస్థలు తప్పడం లేదు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ)
రోడ్లు, వంతెనలు లేక అవస్థలు
ఆసిఫాబాద్ జిల్లాకేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండి వంతెన నిర్మాణానికి నోచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల మండలాలైన తిర్యాణి, లింగాపూర్ మండలాలవాసుల దుస్థితి దయనీయంగా ఉంది. చింతలమానేపల్లి మండలంలోని బాబాసాగర్, నాయికపు గూడా మధ్య వాగుపై వంతెన లేకపోవడం.. కేతిని-దిందా మధ్య వాగుపై, రణవెల్లి-టేకం గూడా మధ్యన ఉన్న వాగులపై బ్రిడ్జీలు లేకపోవడంతో రాకపోకలు సక్రమంగా కొనసాగడం లేదు.
వాగులు పొంగితే తగ్గే వరకు ఆగాల్సి వస్తున్నది. కొత్మిర్-దుబ్బగూడ మధ్య, దహెగాం-కల్వాడ వాగులపై వంతెనలు లేకపోవడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. తిర్యాణి మండలంలోని గుండాల, మంగి గ్రామాలకు రహదారులు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. బెజ్జూర్ మండలంలోని సోమిని-బెజ్జూర్ మధ్య రెండు వంతెనలు అసంపూర్తిగా ఉన్నాయి. అటవీ శాఖ అనుమతులు లేక నిలిచిపోయాయి.
ప్రస్తుతం టైగర్ కారిడార్ కావడంతో వంతెనలు పూర్తి అవుతాయనే నమ్మకం కూడా లేదు. ఈ వంతెనలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో బెజ్జూర్ మండలంలోని సుస్మీర్, గెర్రెగూడా, సోమని, ఇప్పలగూడా, మూగవెల్లి, దొడ్డిగూడా, నాగవెల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇలా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ అనుమతులు లేక సుమారు 30 రోడ్లు, వంతెనలు నిలిచిపోయాయి. వర్షాకాలం ముగిసే వరకు మారుమూల గిరిజన గ్రామాలకు దారికష్టాలు తప్పడం లేదు.
మృతదేహాన్ని భుజాలపై మోసుకొని..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కరంజీవాడ గ్రామానికి చెందిన పంచాయతీ కార్మికుడు మండాడి కోసు ఇటీవల అనారోగ్యంతో ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తుండగా తాజాగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న అనార్పల్లి వాగు అడ్డంకిగా మారింది. దీంతో గ్రామ సులు మృతదేహాన్ని భుజాలపై మోసుకొని వాగు దాటి స్వగ్రామానికి చేరుకున్నారు. అనంతరం అత్యక్రియలు నిర్వహించారు.
బడికెళ్లి.. వాగు దాటలేక..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెల్కగూడ-వాడిగొంది గ్రామాలు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో పనిచేసే టీచర్లు స్వాతి, సుమలత, నైతం హరిప్రకాశ్, కుర్సెంగ జాలింషా ఎప్పటిలాగే గత బుధవారం ఉదయం విధులకు వెళ్లారు. సాయంత్రం విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా, ఎగువన వర్షాలకు చెల్కగూడ వాగు ఉప్పొంగింది. వరద ఉధృతి తగ్గుతుందేమోనని సుమారు మూడు గంటలపాటు అక్కడే వేచి చూశారు. వాగు నిండుగా ప్రవహిస్తుండడంతో తిరిగి చెల్కగూడ పాఠశాలకు వెళ్లి రాత్రంగా అక్కడే గడిపారు. గురువారం ఉదయం గ్రామస్తులంతా కలిసి వీరిని వాగు దాటించారు.
వరద ఉధృతిలో కొట్టుకుపోయి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని చింతకర్ర కిషన్నాయక్తండాకు చెందిన జాదవ్ కన్నీరాం(80) వాగు దాటుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. కన్నీరాంతోపాటు ఆయన భార్య సరస్వతి, వారి కుమారుడు అభినందన్ పొలం పనులు ముగించుకొని తిరిగి వస్తున్నారు. వాగు దాటుతుండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో సరస్వతి, అభినందన్ ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేరారు. కానీ.. కన్నీరాం వాగులో కొట్టుకుపోయాడు. గ్రామస్తులు గాలించడంతో మృతదేహం దొరికింది.