ఆదిలాబాద్, జూన్ 3(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు(మంగళవారం) జరగనున్నది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మే 13వ తేదీన పోలింగ్ జరుగగా, ఈవీఎంలను పటిష్టమైన బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చారు. ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను టీటీడీసీ.., ఖానాపూర్, నిర్మల్, మథోల్ నియోజకవర్గాల ఓట్లనును సంజయ్‌గాంధీ పాలిటెక్నిక్ కళాశాల.., ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఓట్లను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో లెక్కించనున్నారు.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవనుండగా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలైన ఓట్లను పోలింగ్ బూత్‌ల ఆధారంగా లెక్కిస్తారు. ఈవీఎంలలో పోలైన ఓట్లను రౌండ్లవారీగా లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌కు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లను నియమించగా, వారికి అధికారులు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి రౌండ్‌కు 14 టేబుళ్లలో ఓట్లను లెక్కిస్తారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్లో ముగ్గురి చొప్పున సిబ్బంది ఉంటారు. అదనంగా 20 శాతం కలిపి 378 మంది కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించేందుకు 65 మంది, 17 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 31 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 17 మంది మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. కౌంటింగ్ ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సోమవారం పరిశీలించారు. ఈ ఎన్నికల్లో తమ విజయంపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.