గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కార్మిక క్షేత్రమైన మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు విజయాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించే ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో సభలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని నేడు(శుక్రవారం) బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపడానికి వస్తున్నారు.
మంచిర్యాల కలెక్టరేట్ పరిధిలో బహిరంగ సభను ఏర్పాటు చేయగా.. ఎప్పటికప్పుడు సభా వేదిక పనులను అభ్యర్థితోపాటు ఎంపీ వెంకటేశ్ నేతకాని, నియోజకవర్గ ఇన్చార్జి, ప్రభుత్వ విప్ భాను ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. సభకు 50 వేలకుపైగా మందిని తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. సీఎం రాక సందర్భంగా సభా ప్రాంగణం పరిధి గులాబీ మయమైంది. వీధులు, కూడళ్ల వద్ద భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు.
– మంచిర్యాల, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శుక్రవారం మంచిర్యాల జిల్లాకు రానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు విజయాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించిన గులాబీ బాస్ నేడు మంచిర్యాలకు రానుండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్‌రావు ఏర్పాట్లు చేయిస్తున్నారు.
ఎంపీ వెంకటేశ్ నేతకాని, నియోజకవర్గ ఇన్చార్జి ప్రభుత్వ విప్ భానుప్రసాద్ కలెక్టరేట్ ముందున్న బహిరంగ సభ ప్రాంగణం, వేదిక పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అవసరమైన వాహనాలను సైతం పురమాయిస్తున్నారు. దాదాపు 50వేల మందిని సభకు తీసుకువచ్చేలా సిద్ధం చేస్తున్నారు. సభ మధ్యాహ్నం ఉన్న నేపథ్యంలో వచ్చే వారు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే వారి కోసం తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు.
ఒకవేళ ఎండతో ఇబ్బంది పడకుండా భారీ టెంట్లు వేస్తున్నారు. సీఎం రాక నేపథ్యంలో సభ ప్రాంగణం చుట్టూ పక్కల ప్రాంతాలు గులాబీ మయమైపోయాయి. భారీ ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటారు. ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి అదే హెలికాప్టర్లో భూపాలపల్లి ప్రజా ఆశీర్వాద సభకు వెళ్తారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.