మంచిర్యాల అర్బన్/చెన్నూర్ టౌన్, సెప్టెంబర్ 6 : ప్రకృతిలో మమేకమవుతూ నేలా, నీరూ, చెట్టూ.. పుట్టా.. తదితర వాటిని ఆరాధించడం మన సంస్కృతిలో అనాదిగా వస్తున్న ఆచారం. హిందువుల పండుగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ పర్వదినం నాడు వీధివీధినా వినాయక విగ్రహాలను నెలకొల్పి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 7న వినాయక చవితి పండుగ కోసం ఊరూరా ఏర్పాట్లు చేస్తున్నారు.
మట్టి ప్రతిమలే మేలు..
మట్టితో రూపొందించే విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు. చెరువు దరిలో బంకమట్టికి కొ దవ ఉండదు. ఈ మట్టితో చేతిలో ఇమిడే విగ్రహాలు మొదలుకొని, కంకబొంగులు, జనుపనార, గడ్డి, పీచు సాయంతో పెద్ద విగ్రహాలనూ రూపొందించవచ్చు. వీటి కి సహజ రంగులు అద్దితే ఆకర్షణలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు ఏమాత్రం తీసిపోవు. మట్టి విగ్రహాలను తయారు చేసినప్పుడు మట్టిలోని ధాతువులు మనుషులకు అంటుకొని మంచి ఆరోగ్యాన్నిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
పలువురి ఆదర్శం..
జిల్లాలోని కొన్ని చోట్ల పర్యావరణ ప్రేమికులు మట్టి గణపతి విగ్రహాలనే ఏర్పాటు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ హితాన్ని కోరుకునేవారు మట్టి విగ్రహాలను ఊరూరా ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రకృతిపై తమ ప్రేమను చాటుకుంటున్నారు. చెన్నూర్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మహేశ్ కూడా ఏటా మట్టి విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ హితానికి తోడ్పడుతున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ ధరలోనే పలువురికి విగ్రహాలను అందిస్తున్నారు. చెన్నూర్ పట్టణానికి చెందిన విశ్వకర్మ గణేశ్ మండలి వారు ఏటా మట్టితో చేసిన వినాయకుడిని మండపంలో ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తుండడం విశేషం.
మార్కెట్లో సందడి…
మార్కెట్లలో సందడి నెలకొంది. వినాయకుడిని కొలిచేందుకు కావాల్సిన ఎలక్కాయలు, తామరపూలు, మామిడి ఆకులు, ఉసిరి, సీతాఫలాలు, పూజా సామగ్రిని భక్తులు కొనుగోలు చేశారు.