లక్షెట్టిపేట, డిసెంబర్ 24 : లక్షెట్టిపేట పట్టణంలోని సీఎస్ఐ చర్చికి ఘన చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ర్టాల్లోనే అతిపెద్ద రెండో చర్చిగా పేరుగాంచింది. 1935లో ఆంగ్లేయులు నిర్మించగా, మతసామరస్యాలకు ప్రతీకగా నిలుస్తున్నది. దూరం నుంచి చూసినప్పుడు మినార్లతో మసీదువలే.. లోపలికి వెళ్తే మందిరం వలే.. ప్రధాన ద్వారం వద్ద నిలబడి చూస్తే చర్చిలో ఉన్నామనే భావన కలుగుతుంది.
విశాలమైన ప్రాంగణం
ఈ చర్చి సుమారు 80 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని ఆవరణలో టేకు వనం చూపరులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది. ఒకేసారి వేలాది మంది ప్రార్థన చేసుకోవచ్చు. 1940లో అతి పెద్ద మిషన్ దవాఖాన ఉండేది. అది మూతపడి చాలా ఏళ్లు కావస్తున్నది. దీని ప్రాంగణంలో వందేళ్లు పై బడిన ఊడలమర్రి ఉంది.
సేవా కార్యక్రమాలు
ఈ చర్చి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 1975 నుంచి ఇక్కడ వసతి గృహంతో కూడిన ఆశ్రమ పాఠశాల కొసాగుతోంది. ఈ పాఠశాలలో చదివిన వేలాది మంది ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఈ ఏడాది నుంచి ఇక్కడి సీఎస్ఐ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం కూడా బోధిస్తున్నారు.
ఐదు దశాబ్దాలుగా..
మందమర్రి, డిసెంబర్ 24 : మందమర్రిలోని సీఎస్ఐ చర్చి సుమారు ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తోంది. 1972 నవంబర్ 24న నిర్మాణం పనులు ప్రారంభం కాగా, రెండేళ్లపాటు కొనసాగాయి. 1974, నవంబర్ 20న అప్పటి సీఎస్ఐ సంస్థ రెవరెండ్ హెడీఎల్ అబ్రహం బిషప్ ప్రారంభించారు. అప్పటి నుంచి సుమారు క్రీస్తును ఆరాధించే వారికి మేలు చేకూర్చే ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోంది.
చర్చిలు ముస్తాబు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చిలు వేడుకలకు ముస్తాబయ్యాయి. రంగులు వేసి.. విద్యుద్దీపాలను అమర్చి శోభాయమానంగా ముస్తాబు చేశారు. బాలయేసు, మేరిమాత, క్రిస్మస్ ట్రీలు, పశువుల పాకలు, నక్షత్రాలు ఏర్పాటు చేశారు.
స్వరాష్ట్రంలో ఘనంగా..
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తున్నది. బతుకమ్మ పండుగ కోసం ఆడబిడ్డలకు చీరెలు, రంజా న్ సందర్భంగా ముస్లింలకు కొత్త బట్టలు అందజేస్తున్నది. క్రిస్మస్కు క్రిస్టియన్ మైనార్టీల్లోని పేదలకు 2014 నుంచి గిఫ్ట్ ప్యాక్‌లు ఇస్తున్నది.
క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేశాం
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మెదక్ చర్చి అతి పెద్దది. రెండో చర్చి లక్షెట్టిపేటదే. ఇక్కడ 100 పడకల మిషన్ దవాఖాన ఉండేది. ప్రస్తుతం అది మూతపడింది. త్వరలోనే పునఃప్రారంభించేందుకు కృషిచేస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ వసతి గృహంతో పాటు సీఎస్ఐ పాఠశాల, వృద్ధాశ్రమం, సండే పాఠశాల కొనసాగిస్తున్నాం. యేటా ఏప్రిల్‌లో 24 నుంచి 26వ తేదీ వరకు ఏసుక్రీస్తు పునరుద్ధారణ జాతర నిర్వహిస్తున్నాం. ఏటా కొత్త సంవత్సరం వేడుకలు, గుడ్ ఫ్రైడే, మట్టల ఆదివారం, క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. మార్చి ఒకటి నుంచి 40 రోజులపాటు ఉపవాస దీక్షలు కూడా చేస్తాము, ప్రస్తుతం క్రిస్మస్ పండుగకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం.- రెవరెండ్ బీ.కరుణాకర్, పాస్టర్, ప్రెస్ బీటర్ ఇన్చార్జి, లక్షెట్టిపేట