నేడే మహా శివరాత్రి
ముస్తాబైన శైవ క్షేత్రాలు
ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీలు
మంచిర్యాల, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ);హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్త్యమైనది. శివ భక్తులకు అత్యంత పర్వదినమైన శివరాత్రి చాంద్రమాన లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజు వస్తుంది. ఏటా మాఘ బహుళ చతుర్దశి రోజు చంద్రుడు శివుని నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనపుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతున్నది. శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు.. మహా శివరాత్రి పండుగ రోజు అన్ని శివాలయాల్లో ప్రత్యేక పూజలు, పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేస్తారు. శివ భక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు.రాత్రి అంతా శివపూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథాపారాయణాలు జరుపుతారు. శివాలయాల్లో ఉత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తారు. ఓం నమశ్శివాయ మహా పవిత్ర మంత్రాన్ని పఠిస్తారు.
గోదావరి తీరంలోని ఆలయాలు
దండేపల్లి, ఫిబ్రవరి 28 : మహా శివరాత్రి వేడుకలకు దండేపల్లి మండలంలోని గోదావరి తీరంలో ఉన్న దేవాలయాలు ముస్తాబయ్యాయి. ఏడేళ్ల క్రితం నదీ తీరంలో గంగాదేవి ఆలయం నిర్మించారు. మంగళవారం గంగమ్మతల్లి, శివలింగానికి భక్తులు పుణ్య స్నానాలు చేసి పూజలు చేస్తారు. నర్సాపూర్ శివారులోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున మహాగణపతి దేవాలయం ఐదు దేవాలయాల సమహారంగా ఉంది. ప్రాంగణంలో భ్రమరాంభ దేవత,శివలింగం, పక్కనే పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, మరో పక్క సాయి బాబా, మహాగణపతి దేవాలయాలు ఉన్నాయి. మేదరిపేటలో వెలిసిన శ్రీలక్ష్మీనారాయణస్వామి అన్నపూర్ణ కాశీవిశ్వేశ్వరాలయం ప్రసిద్ధి చెందింది. ప్రధాన రహదారికి ఆనుకొని, గోదావరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఆలయాన్ని దర్శించుకుంటారు. సత్యదేవుని నిలయం గూడెం తర్వాత అంతటి ప్రాచుర్యమున్న మరో పుణ్యక్షేత్రం ద్వారక. గోదావరి సమీపంలోని నది తీరంలో వెలిసిన శివుని ఆలయం దత్తాత్రేయునిగా ప్రసిద్ధి. లక్ష్మీకాంతాపూర్ గోదావరి తీరంలో ఉన్న మల్లికార్జునస్వామి పురాతన ఆలయం భక్తులు కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాలు భక్తుల రద్దీ ఉంటుంది. పరిసర ప్రాంతాలైన 10 గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. పట్నాలు, పూజలు, బోనాలు, స్వామి వారికి నైవేధ్యం సమర్పించనున్నారు. శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నారు. అదే రాత్రి జాగరణ చేయనున్నారు.
మహా జాతరకు ముస్తాబు
బేల, ఫిబ్రవరి 28 : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని బాది గ్రామ శివారులోని నందీశ్వర ఆలయానికి ఏండ్ల చరిత్ర ఉంది. ఇది శాతవాహ నుల కాలంలో నిర్మించిన అత్యంత పురాతన ఆలయం. గుడిలోని నందీశ్వరుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని ఐదు రోజులపాటు జాతర కొనసాగుతుంది. సోమవారం జుగ్నాకే వంశస్థులు ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. జిల్లాతోపాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్, పాండ్రకవడ, యావత్మాల్ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కలు తీర్చుకుంటారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేడే శివరాత్రి..
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. మంగళవారం శివరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యుద్దీపాల వెలుగులో ఆలయాలు కాంతులీనుతున్నాయి. జిల్లాలోని కత్తెరశాల మల్లన్న , బుగ్గ రాజేశ్వర, వేలాల మల్లన్న, చెన్నూర్ శివాలయం.. తదితర శివాలయాలకు పెద్ద ఎత్తున భక్తులు రానుండగా, అందుకనుగుణంగా కమిటీలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఆలయాలన్నీ హరహర మహాదేవ.. ఓం నమశ్శివాయ నామస్మరణలతో మార్మోగనున్నాయి. ఉపవాస దీక్షలతో రాత్రంతా జాగరణ చేసి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు సన్నద్ధమవుతున్నారు. చెన్నూర్‌లో ప్రజలు గోదావరి ఉత్తరవాహినిల పుణ్యస్నానాలు ఆచరించి, అంబా అగస్త్యేశ్వరాలయం (శివాలయం)లో ప్రత్యేక పూజలు చేస్తారు. గూడెం పరిసర ప్రాంతాల్లోని భక్తులు సమీపంలోని గోదావరి నదిలో స్నానాలాచరించి గూడెంలోని ఆలయంలో అర్చనలు, పూజలు నిర్వహిస్తారు. వీటితో పాటు జిల్లాలోని శివాలయాన్నింటిల్లో సందడి నెలకొంటుంది.
శివుడే కదిలి వచ్చిన క్షేత్రం.. కదిలి పాపహరేశ్వర ఆలయం..
దిలావర్పూర్, ఫిబ్రవరి 28 : సహ్యాద్రి పర్వత శ్రేణుల చివరి సానువుల్లో మాతాన్నపూర్ణేశ్వరీ సమేతుడై స్వయంభూగా వెలిసిన లింగాకారుడాయన. తండ్రి ఆజ్ఞపై తల్లి తల నరికిన పరశురాముడి మాతృహత్యా పాతకాన్ని తొలగించిన పరమ పావన మూర్తి. తన భక్తుడి భక్తికి తన్మయత్వంతో కదలడంతో ఆ ఆలయానికి కదిలె అని పేరు వచ్చింది. అదే కదిలె పాపహరేశ్వర క్షేత్రం. ఇది నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని కదిలి గ్రామంలో ఉంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ముస్తాబు చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు క్యూలైన్స్, తాగునీరు, పార్కింగ్ ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతుండగా..రాత్రి 12 గంటలకు శివపార్వతులు కల్యాణం ఉంటుంది. కాగా.. అభిషేక కార్యక్రమంలో పాల్గొనే భక్తులు తప్పకుండా సంప్రదాయ దుస్తులు ధరించాలి.
ప్రకృతిలో మమేకం.. బూర్గుపల్లి శివాలయం
మామడ, ఫిబ్రవరి 28 : నిర్మల్ జిల్లా మామడ మండలంలోని బూర్గుపల్లి శ్రీరాజరాజేశ్వరాలయం మహాశివరాత్రి వేడుకలను ముస్తాబైంది. పరమేశ్వరుడు భూలోకానికి వచ్చిన తర్వాత బూర్గుపల్లి ఆలయంలో కొలువయ్యాడు. అనంతరం లక్ష్మణచాంద మండలం బాబాపూర్ శివాలయంలో కొలువై, అక్కడి నుంచి వేములవాడకు వెళ్లినట్లు పురాణాలు చెబుతున్నాయి. బూర్గుపల్లి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటే కొరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జాతరకు వచ్చే భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి 15 కిలోమీటర్లు, మామడ మండల కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కోరికలు తీర్చే గొడిసేర్యాల రాజన్న
దస్తురాబాద్, ఫిబ్రవరి 28 : మండలంలోని గొడిసెర్యాల శ్రీ రాజరాజేశ్వర ఆలయం మహాశివరాత్రి పర్వదినానికి ముస్తాబైంది. యేటా మహా శివరాత్రి సందర్భంగా ఆయ ల కమిటీ ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో నేటి నుంచి నిర్వహించే ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా మహారాత్రి రోజు అర్ధరాత్రి నాగుపాము ప్రత్యక్ష మవుతుందని పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.