తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ పుట్టిన రోజును నేడు ఘనంగా జరుకునేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుచోట్ల ముందస్తు బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) మాజీ సర్పంచ్ మీనాక్షీ-సుభాష్ గాడ్గే దంపతులు తమ మనవనికి కేసీఆర్ పేరు పెట్టారు. రైతులు తమ పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. నేడు(సోమవారం) బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ ఆధ్వర్యంలో నేరడిగొండలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు.
1000 మందికిపైగా పాల్గొననున్నారు. అలాగే మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో నేడు పెద్ద ఎత్తున వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్వంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి, మొక్కలు నాటనున్నారు. మందమర్రిలోని పాలచెట్టు ఏరియాలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, మనో వికాస్ పాఠశాలలో కేక్‌కట్ చేస్తామని, విద్యార్థులకు పండ్లు పంపిణీ చేస్తామని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు.
– ఆదిలాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ)