ఆదిలాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమసారథి, సీఎం కేసీఆర్ మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. యాసంగి వడ్లు కొనేవరకూ కేంద్రంలోని బీజేపీ సర్కారుతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రత్యక్ష పోరుకు సమరశంఖం పూరించారు. రైతుల ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించి కొట్లాడేందుకు దేశ రాజధాని ఢిల్లీలో నేడు(సోమవారం) నిరసన దీక్ష చేపడుతున్నారు. ఇప్పటికే రెండు విడుతలుగా ఢిల్లీ పెద్దలకు వినిపించేలా రైతుల మద్దతుతో గులాబీ దళం ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, కేంద్ర ప్రభుత్వ, ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనాలు, ఇంటిపై నల్లజెండాల ఎగురవేత వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వడ్లు కొనాలని పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించారు. కాగా, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఢిల్లీకి వెళ్లి ఏర్పాట్లు పరిశీలిస్తుండగా.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రైళ్లు, విమానాల ద్వారా తరలివెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు రెండు విడుతలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో తాము రెండు పంటలు వేస్తున్నామని, నిబంధనల ప్రకారం వడ్లను కొనుగోలు చేయాల్సిన కేంద్రంలోని బీజేపీ సర్కారు మొండికేస్తున్నదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు(సోమవారం) ఢిల్లీలో ధర్నా చేపట్టనుంది. ఈ ఆందోళన కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా తరలివెళ్లారు. కొందరు రైళ్లలో మరి కొందరు విమానాల్లో ఢిల్లీకి పయనణమయ్యారు. దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, రైతుబంధు సమితి సభ్యులు, డీసీసీబీ, డీసీఎంఎస్, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు దండుగా తరలివెళ్లారు.
ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఏర్పాట్లను పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. బెల్లంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విమానం ద్వారా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ రైలు ద్వారా ఆదివారం ఉదయం వెళ్లారు. ఆయనతోపాటు టీబీజీకేఎస్ నాయకులు రమేశ్, ఇప్ప తిరుపతి, అలవేన సంపత్, గజెల్లి చంద్రశేఖర్, బంక రమేశ్, రవీశ్వర్ ఉన్నారు. మంచిర్యాల జిల్లా రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య కూడా వెళ్లారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆదివారం కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్‌లు శంషాబాద్ ఏయిర్ పోర్టు నుంచి బయలు దేరి వెళ్లారు. నాగ్‌పూర్ నుంచి ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్‌తో కలిసి జడ్పీటీసీల ఫోరం ఆధ్యక్షుడు తాటిపెల్లి రాజు, జడ్పీటీసీలు కుమ్రసుధాకర్, అనిల్, దుర్గం ట్రస్ట్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు దుర్గం శేఖర్లు కలిసి నాగ్‌పూర్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. వడ్లను కొనుగోలు చేయాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష ప్రదర్శిస్తున్నదని, మోదీ ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయిస్తామని జిల్లా ప్రజాప్రతినిధులు తెలిపారు.