కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఏజెన్సీ గ్రామాలను పులి భయం వీడడం లేదు. గురువారం జైనూర్ మండలం పానపటార్ గ్రామ సమీపంలో బూసిమెట్ట మాజీ ఎంపీటీసీ కుమ్ర భగవంత్‌రావు పత్తి చేనులో పులి కనిపించిందని అదే గ్రామానికి చెందని కుమ్ర శ్యాంరావు – సంగీ త తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్తుండగా.. పత్తి చేనులో పులి పడుకొని కనిపించడంతోభయంతో ఊరిలోకి పరుగులు తీశామని చెప్పారు.
పానపటార్, పారా గ్రామాల ప్రజలు కర్రలు పట్టుకొని పెద్దగా కేకలు వేస్తూ రావడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. పులి పాదముద్రలను గుర్తించారు. పానపటార్ లొద్ది నుంచి తడిహత్నూర్ వైపు వెళ్లినట్లుగా గ్రామస్తులు తెలిపారు. పులి సంచారంపై అటవీ అధికారులు డప్పు చాటింపులతో అవగాహన కల్పించడం తప్ప.. దానిని ట్రాక్చేయడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. కాగా, రెండు రోజుల క్రితం కెరమెరి అడవుల్లో కనిపించిన పులి.. పానపటార్లో కనిపించిన ఒక్కటి కాదని.. రెండు పులులుండే అవకాశమున్నదని జైనూర్ ఎఫ్ఆర్వో జ్ఞానేశ్వర్ తెలిపారు.