కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రోంపల్లి అటవీ ప్రాంతంలో ఆవులపై పెద్దపులి దాడి ( Tiger Attack ) చేసి రెండు ఆవులను ( Cows) , లేగ దూడను ( Calf ) హత మార్చింది. దేవాపూర్ రేంజర్ అనిత తెలిపిన వివరాల ప్రకారం.. రోంపల్లి అటవీ పరిధిలోకి వెళ్లిన ఆవులపై పెద్ద పులి దాడి చేసిందని వెల్లడించారు. ఈ దాడిలో రెండు ఆవులు, ఒక లేగ దూడను హతమార్చిందని తెలిపారు.
ఫారెస్ట్ అధికారులు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి పెద్ద పులి పాద ముద్రలు గుర్తించి వివరాలను నమోదు చేశామన్నారు. ఈ మేరకు రోంపల్లికి చెందిన ఆవుల యాజమాని బాధిత రైతు వివరాలను పరిహారం కోసం వివరాలను పంపినట్లు పేర్కొన్నారు. పెద్దపులి కాసిపేట మండలం శివారు అటవీ ప్రాంతం నుంచి ఆసిఫాబాద్ కుమ్రం భీం జిల్లా తిర్యాణ మండల శివార్ల మధ్య సంచరిస్తుందని వివరించారు. తిర్యాణి, కాసిపేట మండలాల అటవీ శివారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.