కాసిపేట, ఫిబ్రవరి 6 : మండలంలోని కొత్త వరిపేట, పెద్దనపల్లి, దుబ్బగూడెం, సోమగూడెం పాత బస్తీ, బుగ్గగూడెం, కన్నాల శివారులలో పెద్దపులి(బీ1) సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. నాలుగు రోజుల క్రితం కన్నాల శివారులో అడవి పందిపై దాడి చేసి హతమార్చగా, గురువారం కొత్త వరిపేటలో మరో అడవిపందిని చంపేసింది. కొంత మాంసాన్ని తిని వెళ్లిపోయినట్లు తెలిసింది.
పెద్దనపల్లి శివారులోని కాసిపేట, బెల్లంపల్లికి వచ్చే దారిలో నూతనంగా సింగరేణి వేస్తున్న రోడ్డు మార్గంలో పెద్దపులి గాండ్రింపులు వినపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో దాని పాదముద్రలు కనిపించాయి. మరుసటి రోజు కళేబరం వద్దకు వచ్చే అవకాశముండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఈ అటవీ ప్రాంతంలో నీటి వసతితో పాటు అడవి పందుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పులి ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దానికి ఎలాంటి హానీ జరగకూడదనే ఉద్దేశంతో ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు కదలికలు గమనిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోకి రాకపోకలు నిలిపివేశారు. పులి కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలని వారు కోరుతున్నారు.