బెజ్జూర్, అక్టోబర్ 26 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు మండలంలోని ఎర్రబండ వద్ద ప్రాణహిత నదిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఘటన శనివారం జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..బెజ్జూర్కు చెందిన జహీర్ హుస్సేన్(23), ఇర్షాద్ (20), మోహిజ్(19) శనివారం షాపులు బంద్ ఉండడంతో మండలంలోని ఎర్రబండ వద్ద ప్రాణహిత నది వద్దకు ఈతకు వెళ్లారు. నదిలో స్నానాలు చేశారు.
కొద్ది సేపటి తర్వాత నదిలోని మడుగులో ఈత కోసం వెళ్లారు. అది లోతు ఎక్కువగా ఉండడంతో ఒక్కొక్కరుగా మునిగిపోయారు. వీరితో పాటు వచ్చిన మరో మిత్రుడు ఖాజీం ఒడ్డున ఉండి కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు వచ్చి వెతికినా దొరకలేదు. కుటుంబ సభ్యులు, ఎస్ఐ విక్రమ్, ఆర్ఐ సంతోష్, సిబ్బందితో వచ్చి గజ ఈతగాళ్ల రాత్రి 10 గంటల వరకు వెతికినా ఆచూకీ దొరకలేదు.
Adilabad