భారత రాష్ట్ర సమితి
(బీఆర్ఎస్) రజతోత్సవ సభ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టి ఎన్నో ఏండ్ల ఉద్యమ ప్రస్తానం సాగించి.. ఆటుపోటన్లు ఎదుర్కొని స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల ఆవిర్భావ పండుగకు సిద్ధమైంది. ఈ సభను పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అధినేత కేసీఆర్ స్వయంగా అన్ని జిల్లాల పార్టీ నాయకులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. 1,300 ఎకరాల భారీ విస్తీర్ణంలో లక్షలాది మందితో సభ నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
ఇందులో భాగంగా నెల రోజుల నుంచి అన్ని జిల్లాల్లో పార్టీ విస్తృత కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నది. తొలుత ప్రతి నియోజకవర్గంలో సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు. వాల్ రైటింగ్‌లు, నాయకులతో నిత్యం సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ రజతోత్సవ పండుగను విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని నియో జకవర్గాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలు పార్టీ శ్రేణుల్లో నూతన జవసత్వాలు, కొత్త ఉత్సా హాన్ని నింపాయి.
అదే ఉత్సాహంతో ఈ నెల 27వ తేదీన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వ హించే సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభి మానులు తరలివెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 25 ఏండ్ల బీఆర్ఎస్ ప్రస్తానం ఎలా సాగింది. రానున్న రోజుల్లో పార్టీ ఎలాంటి కార్యాచ రణతో ముందుకు వెళ్లనుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
– మంచిర్యాల, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ముందు నుంచి బీఆర్ఎస్కు తోడు
తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ముందు నుంచి తోడుగా నిలిచారు. 2001లో పార్టీ ఆవిర్భావం అనంతరం 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 28 సీట్లలో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేయగా, ఉమ్మడి జిల్లా నుంచి బోథ్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. అదే సమయంలో ఆదిలాబాద్ ఎంపీ సీటును కైవసం చేసుకుంది.
రాష్ట్ర సాధన కోసం అధినేత కేసీఆర్ నాడు పార్టీ నుంచి గెలుపొందిన నాయకులను రాజీనామా చేయాలని కోరగా.. ఎంపీ సహా, ఖానాపూర్ ఎమ్మెల్యే కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవిస్తూ రాజీనామాలు చేశారు. మిగిలిన రెండు నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యే అసమ్మతి వర్గంగా నిలిచిపోయారు. ఉప ఎన్నికల్లో ఎంపీ సీటుసహా ఖానాపూర్ ఎమ్మెల్యే సీటును బీఆర్ఎస్ కోల్పోయింది. దీంతో ఉమ్మడి జిల్లాలో పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ.. తెలంగాణ ఉద్యమం ముందు అవేవి పని చేయలేదు.
ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా నాయకులు వలస వచ్చారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక జిల్లాలో పార్టీకి తిరుగులేకుండా పోయింది. స్వరాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పార్టీ గెలుపొందింది. నిర్మల్, సిర్పూర్ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక మిగిలిన ఒక్క ముథోల్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కొన్ని రోజులకు బీఆర్ఎస్లో చేరారు. అలా పది అసెంబ్లీ స్థానాల్లో అన్నింటిలోనూ బీఆర్ఎస్ పాగా వేసింది.
అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. ఆసిఫాబాద్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్లో చేరారు. అలా పదేండ్లు ఉమ్మడి జిల్లాలో పార్టీ వెలుగు వెలిగింది. కానీ.. 2023 ఎన్నికల్లో ప్రజా తీర్పు మరోలా వచ్చింది. తెలంగాణలో పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ ప్రజల్లో బీఆర్ఎస్ నమ్మకం మాత్రం సడల్లేదు. తెలంగాణలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారు.
జోష్ పెరగనుంది..
ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనేది తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2001లో పార్టీ ఆవిర్భావానికి ముందు తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ఇప్పుడు దాదాపు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంట పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరెంట్ కోతలు మళ్లీ పునరావృతం అవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుత పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు. ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఇదే సమయంలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ అలుపెరగని పోరు చేస్తున్నది.
తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నది. అధికార పార్టీ భూ దాహానికి అడ్డుపడుతూ.. లగచర్చ బాధితులకు అండగా నిలిచింది. హైడ్రా పేరుతో చేసిన విధ్వంసానికి బలైపోయిన బాధితుల పక్షాన వకాల్తా పుచ్చుకున్నది. మొన్నటికి మొన్న హెచ్‌సీయూ భూముల్లో అటవీ విధ్వంసాన్ని అడ్డుకోడంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటూ పార్టీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభపై యావత్ తెలంగాణ ప్రత్యేక దృష్టి సారించింది. సభ అనంతరం నిరంతర కార్యక్రమాలతో బీఆర్ఎస్ ప్రజల్లో ఉండేందుకు, ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో జోష్ మారింత పెరగనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సభను విజయవంతం చేయండి
కోటపల్లి, ఏప్రిల్ 22 : ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. కోటపల్లి మండలం పిన్నారం గ్రామంలో ప్రచారంలో భాగంగా రజతోత్సవ సభ పోస్టర్లను అంటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌కు ఎలా అండగా ఉన్నారో కాంగ్రెస్ పాలన నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడుకునేందుకు అదే విధంగా మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఉద్యమ స్ఫూర్తితో ముందుకు..
2001లో తెలంగాణ కోసం కేసీఆర్ సార్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో స్వరాష్ర్టాన్ని సాధించారు. స్వరాష్ట్రంలో పదేళ్లు అద్భుతమైన పాలనను అందించారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులున్నాయో.. ప్రస్తుతం అదే దుస్థితి. మొన్నటి వరకు సుభీక్షంగా ఉన్న తెలంగాణ నేడు ఆగమైపోయింది.
తెలంగాణకు అన్యాయం చేసేందుకు ఆంధ్ర కుట్రలు మళ్లీ మొదలైనయ్. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2001 నుంచి తెలంగాణ కోసం ఎలాంటి ఉద్యమమైతే చేశామో.. అదే ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రజతోత్సవ సభతో ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. మంచిర్యాల జిల్లా నుంచి దాదాపు 10 వేల నుంచి 12వేల మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
-బాల్క సుమన్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు
బీఆర్ఎస్తోనే భవిష్యత్
బీఆర్ఎస్తోనే తెలంగాణ ప్రజల భవిష్యత్ ముడిపడి ఉంది. 25 ఏండ్లలో తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసింది బీఆర్ఎస్. ప్రజల కోసం కొట్లాడి అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ. పదేండ్ల పాలనలో ప్రజల కోసం పరితపించిన పార్టీ. ఈ విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలో రావడం కాయం. రజతోత్సవంలో మా అధినేత కేసీఆర్ ఎలా దిశానిర్దేశం చేస్తే అలా పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తాం. ఈ సభకు నియోజకవర్గం నుంచి దాదాపు 4 వేల మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలేందుకు సిద్ధమయ్యారు.
-దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే
చరిత్రలో నిలిచిపోయేలా సభ
తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె, మానవహారం, పీపుల్స్‌మార్చ్ ఇలా ఎన్నో మైలురాళ్ల లాంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ చేపట్టింది. ఇదే అదే స్ఫూర్తితో చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవసభకు ఏర్పాట్లు చేస్తున్నది. గ్రామ గ్రామాల్లో బీఆర్ఎస్ పండుగ వాతావరణం నెలకొన్నది. 27న జెండాను ఎత్తే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి, సభకు తరలివెళ్లేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సిద్ధమయ్యారు. ఈ సభలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఒక మంచి మెసేజ్ ఇవ్వనుంది. ఇప్పటికే ఎక్కడ చూసినా బీఆర్ఎస్ సభపై చర్చ నడుస్తున్నది. 25 ఏండ్ల పండుగ నేపథ్యంలో ప్రజలు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నెలకొంది. మంచిర్యాల నుంచి పెద్దసంఖ్యలో సభకు తరలివెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నాం.
-నడిపెల్లి దివాకర్‌రావు, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే
స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు మొగ్గు..
రజతోత్సవ సభకు ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి 3000 మందిని తరలించాలనేది లక్ష్యం. కానీ ప్రజలు స్వచ్ఛందంగా సభకు రావడానికి మొగ్గుచూపుతున్నారు. సన్నాహాక సమావేశంలో ఐదు వేల మంది సభకు వచ్చేందుకు సిద్ధమని చెప్పారు. ఈ మేరకు వాహనాలు ఏర్పాటు చేసి వారిని తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ సభతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపనున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. అధినేత కేసీఆర్ దిశానిర్దేశంతో రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం.
-కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
కేసీఆరే శ్రీరామ రక్ష
నిర్మల్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ) : పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృ ద్ధి తర్వాత ఈ 16 నెలల కాంగ్రెస్ పాలన లో మళ్లీ పదేండ్లు వెనకబడి పోయామని ప్రజలు ఆవేదన చెందుతున్నరు. ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోస పూరిత హామీలను నమ్మి మోసపోయా మని ప్రజలకు అర్థమైంది. స్వయంగా కాంగ్రెస్ నాయకులే గ్రామాల్లో తాము కాంగ్రెస్ నాయకులమని చెప్పుకునే పరిస్థితి లేదు. తెలంగాణ కు కేసీఆరే శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నరు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులతో పాటు, అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఖానాపూర్ నియోజక వర్గం నుంచి నాలుగు వేల మందిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుడు కేసీఆరే అని, ఆయనకు అండగా ఉండి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి గుండే వరంగల్ వైపు చూస్తున్నది. ఈ సభ ద్వారా రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలకు కేసీఆరే శ్రీరామ రక్ష అని తేలిపోతుంది. 13 ఏళ్లపాటు స్వరాష్ట్రం కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నం. సాధించుకున్న తెలంగాణలో పదేండ్లు బీఆర్ఎస్ పాలన అద్భుతంగా సాగింది. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందాయి. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్.
– భుక్యా జాన్సన్ నాయక్, ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ కర్త