దండేపల్లి, జూన్ 15 : కొండాపూర్ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ ప్రభాకర్‌పై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన భారతారపు లింగయ్య, కుమారస్వామిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం దండేప ల్లి మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భూ విషయమై గ్రామానికి చెందిన తం డ్రీకొడుకులు లింగయ్య, కుమారస్వామి ఓ మహిళతో గొడవ పడ్డారు. సదరు మహిళా జీపీ మల్టీపర్పస్ వర్కర్ ప్రభాకర్‌ను అక్కడికి పిలిచింది.
ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకోగానే వికలాంగుడు అని చూడకుండా తండ్రీకొడుకులు విచక్షణారహితంగా కొట్టడంతో చేయి విరిగింది. తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఇదే విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎస్ఐ రిమాండ్ చేయడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఎస్ఐ తహసినొద్దీన్ ఆందోళన వద్ద కు చేరుకొని మాట్లాడే ప్రయత్నం చేయగా, గ్రామస్తులు-ఎస్ఐకి మధ్య వాగ్వాదం జరిగింది.
దాడి చేసిన వారిని ఎందుకు రిమాండ్ చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సు మారు గంట పాటు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విచారణ జరిపి నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. గ్రామ పెద్దలు పోలీస్‌స్టేషన్‌లోకి రాగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి వా రితో మాట్లాడారు. మెడికల్ రిపోర్టు రాగానే వారిని రిమాండ్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.