ఆదిలాబాద్ జిల్లాలో ఈ యేడాది యాసంగిలో ప్రాజెక్టుల కింది భూములకు సరిపడా నీరు అందనుంది. వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల్లోకి పుష్కలంగా నీరు చేరింది. వానకాలం పంటలు చివరి దశకు చేరుకోగా.. యాసంగి పంటలు వేయడానికి అన్నదాతలు సిద్ధం అవుతున్నారు. ఈ సీజన్లో శనగ, జొన్న, గోధుమ, ఆరుతడి పంటలు వేయనున్నారు. వారబందీ విధానంలో అధికారులు ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నారు.
– ఆదిలాబాద్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి కొరత కారణంగా వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేసేవారు. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నా నిర్వహణ లేకపోవడం వ్యవసాయ భూములకు సాగునీరు అందేది కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేసింది. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మరమ్మతులు, కాలువల ఆధునీకరణ, మిషన్‌కాకతీయ పథకంలో భాగంగా చెరువులను బాగు చేసింది. దీంతో జిల్లాలో రైతులకు రెండు పంటలకు సాగునీరు అందుతున్నది.
ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి తీసుకున్న చర్యల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. రెండు సీజన్లలో రైతులు లాభదాయకమైన పంటలు సాగు చేస్తున్నారు. గతంలో సాగునీటి ఇబ్బందుల కారణంగా ఒక పంట వేయాలంటే భయపడే రైతులు ఇప్పుడు నిర్భయంగా రెండు సీజన్లలో పంటలు సాగు చేస్తున్నారు. అధికారులు సైతం రైతులు పండించే పంటలకు అవసరమైన సమయాల్లో ప్రాజెక్టుల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు.
ఈ ఏడాది వానకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా సాగునీటి ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరింది. జిల్లాలో సాధారణ వర్షపాతం 1087.6 మిల్లీ మీటర్లు కాగా, 1249.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నారు. సీజన్లో భారీ వర్షాల సమయంలో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి కాలువల ద్వారా నీటిని బయటకు వదిలారు. ప్రాజెక్టు కింద ఆయకట్టుకు వానకాలం పంటలకు రైతులకు నీటిని సరఫరా చేశారు.
జిల్లాలోని 1.50 లక్షల ఎకరాల్లో యాసంగి సాగువిస్తీర్ణం ఉండగా, ప్రాజెక్టుల ద్వారా పంటలకు నీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టు కింద 18 వేలు, మత్తడివాగు ప్రాజెక్టు కింద 6 వేల ఎకరాలను సాగునీటిని అందించనున్నారు. 3 నెలల పాటు వారబందీ విధానంలో పంటలకు నీటిని అందించనున్నారు. యాసంగి పంటలకు అవసరమైన సాగునీరు లభిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.