కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( UBI ) బ్రాంచి లో ఏటీఎం( ATM ), పాస్ బుక్ ప్రింటర్ ( Pass Book Printer ) కొంతకాలంగా పనిచేయకపోవడంతో ఖాతాదారులకు తిప్పలు తప్పడం లేదు. ఏటీఎం రూంలోనే బ్యాంకు పాస్ పుస్తకాల ప్రింటర్ యంత్రాన్ని ఏర్పాటు చేయడంతో ఖాతాదారులు డబ్బులు తీసుకోవడంలో ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ. వెయ్యి కి 10 కమిషన్ ఇచ్చి నష్టపోతున్నారు.
దీంతోపాటు ఖాతాదారులు తమ ఖాతాల్లో జమ చేసిన డబ్బుల వివరాలను ప్రింట్ చేయించుకుందామంటే ఏటీఎం గదికి తాళం వేసి ఉంటుందని వాపోయారు. మహిళా సంఘాల సభ్యులు డబ్బులు జమ చేసిన అనంతరం ప్రింట్ తీసి ఇవ్వమని సిబ్బందిని కోరుతున్నా పాస్ బుక్ ప్రింట్ తీసుకోవాలని సిబ్బంది మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించాలన్న తపన ఏ ఒక్క సిబ్బందిలో కనిపించక పోవడం విడ్డూరంగా ఉందని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్
రాహుల్‌ను వివరణ కోరగా ఇంత చిన్న విషయానికి తన వద్దకు రావడం అనవసరం. సిబ్బందికి చెప్పండి అని సమాధానం దాటవేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఏటీఎం, పాస్‌బుక్ ప్రింటర్లకు మరమత్తులు చేయించి కస్టమర్లకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.