ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ( Adilabad ) మార్కెట్ యార్డులో జొన్న పంటకు కాపలాగా ఉన్న రైతులపై దొంగలు దాడికి( Thieves attack) పాల్పడ్డారు. రెండు రోజుల కిందట జొన్న పంటను విక్రయించడానికి ఫాత్మాల మండలం రామయ్య గ్రామానికి దిలీప్ రెడ్డి ( Dileepreddy), తలమడుగు మండలం బరంపూర్‌కు చెందిన నారాయణ ( Narayana) అనే రైతులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌కు పంటను తీసుకువచ్చారు.
పంట కొనుగోళ్లలో జాప్యం కారణంగా రెండు రోజులుగా మార్కెట్ యార్డ్‌లోనే నిద్రిస్తున్నారు. బుధవారం రాత్రి కొందరు దొంగలు జొన్నలను దొంగలించడానికి రాగా రైతులు వీరిని అడ్డుకున్నారు. దీంతో దొంగలు రైతులపై కట్టెలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో దిలీప్ రెడ్డి , నారాయణ అనే ఇద్దరు రైతుల తలలకు గాయాలయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు మార్కెట్ యార్డ్‌కు చేరుకుని గాయపడ్డ రైతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.