Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Model Code of Conduct) తుంగలో తొక్కుతోందని భారత రాష్ట్ర సమితి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ (Kuruva Vijay Kumar) నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినిని కలిసి, అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించింది.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి కాంగ్రెస్ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ప్రచారం ముగిసినా.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొమ్మెర రామ్మూర్తి, సురివి యాదయ్య గౌడ్, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి సదానంద్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ.
తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Model Code of Conduct) తుంగలో తొక్కుతోందని భారత్ రాష్ట్ర సమితి తీవ్ర… pic.twitter.com/kxKTBKs9sY
— BRS Party (@BRSparty) February 10, 2026
1. గద్వాల ఎమ్మెల్యేపై ఫిర్యాదు: గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 48 గంటల ‘నిశ్శబ్ద కాలాన్ని’ (Silence Period) బేఖాతరు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. గద్వాల పట్టణంలోని 17వ వార్డుతో పాటు భీమ్ నగర్, బాలాజీ అపార్ట్మెంట్లలో నేటి ఉదయం ఆయన ఓటర్లతో సమావేశాలు నిర్వహించారని, ఇది ఎన్నికల చట్టాల ప్రకారం నేరమని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే ఆయనను ఎన్నికల కార్యకలాపాల నుండి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.
2. ఖమ్మంలో ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం: ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక మంత్రి గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, ట్రెజరీ అధికారులు,TNGO నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వారు మండిపడ్డారు.
3. మహబూబ్ నగర్లో పోలీసుల ఏకపక్ష వైఖరి: మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. వన్ టౌన్ మరియు రూరల్ సీఐలు కాంగ్రెస్ నాయకులు పంచుతున్న మద్యం, డబ్బుకు రక్షణ కల్పిస్తూ..ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
4. రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులు: రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ నాయకులు పోలీసుల అండతో ప్రతిపక్ష పార్టీల ఓటర్లను, కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛాయుతమైన ఎన్నికలకు అవకాశం లేకుండా చేస్తున్నారని కమిషన్కు వివరించారు.
నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల విధుల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను వెంటనే బదిలీ చేయాలి. క్షేత్రస్థాయిలో వీడియో ఫుటేజీలను పరిశీలించి, అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. సామాన్య ఓటరు భయం లేకుండా ఓటు వేసేలా తటస్థ వాతావరణాన్ని కల్పించాలి.