మంచిర్యాల ప్రతినిధి(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల టౌన్, ఆగస్టు 21 : రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని రై తులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు అందరికీ రుణమాఫీ అని చెప్పి.. ఇప్పుడు కారణాలు చెప్తున్నారని రైతులు వాపోతున్నారు. రే షన్‌కార్డు కచ్చితంగా ఉండాలి. రైతు కుటుంబ రుణం రూ.2 లక్షల లోపు ఉండాలి. అలా ఉన్నవారికే రుణమాఫీ అవుతుంది. కార్డు లేకున్నా.. లో న్ ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా రుణమాఫీ కావడం లేదు. అన్ని అర్హతలున్నా కొందరు రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో అన్నదాతలు అయోమయపడుతున్నారు.
మంచిర్యాల నియోజకవర్గంలో రుణమాఫీ పై ‘నమస్తే తెలంగాణ’ బృందం బుధవారం ఫీల్డ్ విజిట్ నిర్వహించింది. కొన్ని గ్రామాల్లో రైతులను కలిసి రుణమాఫీ అయ్యిందా? కాలేదా? అని ఆరా తీసింది. ఈ విజిట్‌లో ఏ గ్రామానికి వెళ్లిన రుణమాఫీ అయినోళ్లు 40 శాతం మంది కూడా లేనట్లు తేలింది. కొన్ని గ్రామాల్లోనైతే 20 శాతం నుంచి 30 శాతం మందికే రుణమాఫీ జరిగింది.
హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామంలో 647 మంది రైతులు ఉండగా.. తొలి విడుత మాఫీలో 84 మందికి, రెండో విడుతలో 45 మందికే రుణమాఫీ అయ్యింది. మూడో విడుతలో ఎంత మందికైది అంటే అధికారులు సమాధానం చెప్పలేపోయారు. మొత్తంగా 200 మందికి కూడా రుణమాఫీ అయి ఉండదని గ్రామస్తులు తెలిపారు.
పథకాలు పెట్టేముందు రేషన్ కార్డు ఇచ్చి పెట్టాలి..
లక్షెటిపేట : ప్రభుత్వ పథకాలు అమలు చేసే ముందు దానికి రేషన్ కార్డు అవసరం ఉంటుందని తెలుసు కనుక ముందుగాల ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చినంకనే పథకాలను ప్రవేశపెట్టాలి. నాకు రేషన్ కార్డు లేదు. నాకు రుణమాఫీ అయితలేదు అని ఆఫీసర్లు చెప్తున్నరు. రేషన్ కార్డు లేనిది అధికారి లోన్ ఎట్టా ఇచ్చిండు తప్పు కదా ఇచ్చిన అధికారి దగ్గర రీకవరీ చేస్తే మంచిగ ఉండదా. రేషన్ కార్డు లేదని అప్పుడే లోన్ ఇవ్వక పోతే నాకు ఈ ఆశ ఉండకపోవుకదా.
రేషన్‌కార్డు లేక నేను ఇప్పటి వరకు ఏ పథకానికి అర్హుడిని కాలేకపోతున్నా. ఇప్పుడు రేషన్ కార్డు లేకున్న రుణమాఫీ చేస్తా అనంగానే ఈ ఒక్క పథకానికి నేను అర్హున్ని అయ్యానని ఆనందపడ్డా. కానీ ఇప్పుడు కూడా నాకు నిరాశనే మిగిలింది. కనీసం ఇక నుంచైనా మీకు అంతగా ప్రజలకు పథకాలు ఇవ్వాలని ఉంటే ముందుగా పథకానికి రేషన్ కార్డు అవసరం. అది ఇచ్చాకనే పథకాలు మొదలు పెట్టుండ్రి. కానీ ఇలా పథకం ఇస్తున్నామని చెప్పి ప్రజలను మోసం చేయకండి.
– ఎంబడి తిరుపతి, లక్షెట్టిపేట.
కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే..
నాకు తాళ్లపేట శివారులో ఎనిమిదె కరాల వ్యవసాయ భూమి ఉంది. సర్కారు రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామంటే సంబురపడ్డాం. తీరా రుణమాఫీ అయ్యాక లిస్టులో పేరు లేకపోవడం బాధగా అనిపించింది. నేను బ్యాంకు నుంచి రూ.2.85లక్షల పంట రుణం తీసుకున్నా. లిస్టులో చూస్తే పేరు కనబడతలేదు. నాలుగో విడుతలో మాఫీ చేస్తామంటున్నారు. ఇప్పటికైతే రెండు లక్షలకు పైన ఉన్న రూ.85వేలు, మిత్తి రూ.40వేలు కట్టాలని బ్యాంకు అధికారులు అంటున్నారు. రెండు లక్షల రుణం మాఫీ చేసి, మిగతా డబ్బులు కట్టమంటే అయిపోతుండే కదా. ఇట్ల సతాయించుడు ఏంది. కట్టినంక కూడా మాఫీ అయితదా? లేదా అంటే గ్యారెంటీ లేదు. కాంగ్రెస్ సర్కారు మాటలను నమ్మబుద్ధి అయితలేదు. మాఫీ మీద ఆశలయితే కనబడుతలేవు.
– మహ్మద్ ఉస్మాన్‌ఖాన్, తాళ్లపేట.
చాలా మందికి కాలేదు
లక్షెటిపేట : నాతోపాటు మా గ్రామంలో చాలా మందికి రుణమాఫీ కాలేదు. నేను నా భర్త ఐదు సంవత్సరాలు రైతుల పక్షాన గ్రామ ప్రజల పక్షాన ఉండి సేవ చేసినం. నా భర్త తెలంగాణ ఉద్యమంలో కూడా తిండి తిప్పలు లేకుండా పని చేసినోడు. సర్పంచ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నం. రైతులకు వెన్నంటే ఉండి రుణాలు ఇప్పించిన మాకు రుణమాఫీ కాలేదు. మాతో పాటు మా గ్రామంలో చాలా మందికి అన్ని ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయలేదు. ఇప్పుడు ఎందుకు కాలేదని ఆఫీసర్లను అడిగితే ఫారం నింపి ఇయ్యాలే చూస్తమని చెబుతున్నారు. అయితదో కాదో తెలియదు. మా పనులు అన్ని ఇడిసి పెట్టుకుని లక్షెట్టిపేటకు పోయి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. ఇస్తరో ఇయ్యరో చెప్పకుండా ఇలా సాకులు చెప్పి పనులు నాశనం చేస్తుండ్రు. ఇది పద్ధతి కాదు. రైతుల ఉసురు తాకుతది.
– శనిగారపు వినోద, రంగపేట గ్రామం, లక్షెట్టిపేట మండలం.
అన్ని ఉన్న నాకు మాఫీ చేయలేదు..
లక్షెటిపేట : నాకు రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది బ్యాంక్ పుస్తకం, పట్టా పుస్తకం అన్ని పెట్టి ఈ ఏడాదే నా పేరుపై రూ. 1.99 లక్షలు, నా భార్య పేరుపై రూ.70వేల రుణం తీసుకున్నా. రూ. 70వేలు తీసుకున్న నా భార్యకు మొదటి విడుతలో మాఫీ అయితదని ఎదురు చూసినా. కానీ కాలేదు. రెండో విడుత అయితది అనుకుంటే కాలేదు. ఇప్పుడు మూడో విడుతలో మా ఇద్దరిలో ఏ ఒక్కరికీ కూడా కాలేదు. ఇట్లా అట్టి మాటలు చెప్పి ఆశ పెట్టి రైతులను ఆడుకునుడు సరికాదు. తీసుకున్న రుణం ఎట్ట తీసుకున్నం ఎవరు ఇచ్చిండ్రు నిజమా కాదా అని చూడాలే మాఫీ చేయాలి. చేతకాని మాటలు పనికి రాని హామీలు ఇచ్చి రైతులను మోసం చేయద్దు బాధ పెట్టొద్దు.
– రాయమల్లు, రామారావుపేట గ్రామం, లక్షెట్టిపేట మండలం.
ఆశపెట్టి ఆగం చేస్తుండ్రు
రేవంత్ రెడ్డి రైతులను ఆశపెట్టి ఆగం చేస్తుండ్రు. ఒక్క మాటకు ఒక్క పథకానికి అర్థం లేకుండా పోతుంది. రుణమాఫీకి రేషన్ కార్డు లేకున్న సరే అన్నడు ఇప్పుడు నా భార్య రేషన్ కార్డుల అనితకు వనిత అని పడ్డందుకు నాభార్యకు రుణమాఫీ చేయలేదు నాదీ ఆపేసిండు. నాకున్న మూడెకరాల భూమికి నా భార్యకు ఉన్న 30 గంటల భూమికి రుణం తీసుకున్న. కానీ.. వాళ్లు చేసిన తప్పుకు కూడా మాకు ఆపిండు. ఇది కరెక్టు కాదు. లోన్ తీసుకునేటప్పుడు కూడా ఇదే రేషన్ కార్డు ఉండే మరి అప్పుడు బ్యాంక్ అధికారుల కడ్లు కరాబయినయా లేకపోతే కాంగ్రెస్ పార్టీ లీడర్ల కండ్లు కరాబయినయో తెలుత్తలేదు.
– బొలిశెట్టి రవి, రంగపేట గ్రామం,లక్షెట్టిపేట మండలం.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
జన్నారం : కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగిన శాసన సభ ఎన్నిల్లో రైతుకు ఇచ్చిన రూ.2 లక్షల రుణాలను వెంటనే మాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలి. మూడో విడుతలో నేను యూనియన్ బ్యాంక్‌లో తీసుకున్న రూ.1.99 లక్షల రుణమాఫీ ప్రస్తుతం సాగు పెట్టుబడికి డబ్బులు లేక బ్యాంక్‌లో రుణాలు ఇవ్వక ఇబ్బంది పడుతున్నాం. వెంటనే రుణమాఫీ చేసి అదుకోవాలి.
– అల్లం నరేశ్, రైతు, రేండ్లగూడ, జన్నారం.
రుణమాఫీ ఏమాయే..
దండేపల్లి : నా పేరిట రూ.1.25 లక్షల వరకు పంట రుణం ఉంది. కాంగ్రెస్ సర్కారు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది. ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. లిస్టులో నా పేరు చూస్తే కనబడుతలేదు. ఊర్ల లీడర్లను కలిస్తే వ్యవసాయశాఖ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోమన్నారు. కేసీఆర్ సారు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండే. కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి రాకముందు అన్ని ఇస్తామని చెప్పి ఇప్పుడు కొర్రీలు పెడుతున్నారు.
– బొల్లి నాగయ్య, నంబాల.
రుణమాఫీ కాదు అంటున్నారు..
మాది మాకులపేట. గతేడాది నా పేరు మీద రూ.2.40 లక్షల పంట రుణం, నా భార్య పేరు మీద రూ.60 వేలు తీసుకున్నాం. ఇప్పటి వరకు మూడు విడుతలైనయ్. ఒక్క విడుత కూడా మాఫీ కాలేదు. ఎందుకు అని బ్యాంకు ల అడిగితే మీరు కొత్త సర్కారు కొలువుదీరి నంక రుణం తీసుకున్నారు. మీకు మాఫీ కావు అంటున్నరు. ఆ లెక్కన నా భార్య కొత్త సర్కారు రాక ముందే తీసుకున్నది. నా భార్య పేరుపై ఉన్న రూ.60 వేలైనా మాఫీ కావాలే కదా. ఇలా ఎందుకు పరేషాన్ చేస్తున్నరు. ఒకలికి ఇచ్చి ఇంకొకలికి ఇయ్యకపోవుడు మంచి పద్ధతేనా? వ్యవసాయ అధికారులను అడిగినా ఇదే మాట అంటున్నరు. కేసీఆర్ సర్కారు హయాం లో రూ.80 వేలు మాఫీ అయ్యాయి. ఈ సర్కార్ వాళ్లు కొర్రీలు పెట్టి సతాయిస్తున్నారు. తెలంగాణ సర్కారులో గిట్ల ఏం అడగలేదు. నాకున్న అప్పు రూ.80 వేలు మాఫీ అయినయ్. కొందరికి ఇచ్చి మరికొందరికి ఇయ్యకపోవడం బాధగా ఉంది.
– గోపతి స్వరూప-మల్లేశ్, మాకులపేట.