జైనథ్, ఏప్రిల్ 2 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై గ్రామ గ్రామాన చర్చ జరగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పిప్పవాడ గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. బీఆర్ఎస్ అనుబంధ గ్రామ కమిటీలు పార్టీ పటిష్టతకు అకింతభావంతో పని చేయాలని కోరారు. 68 ఏండ్లపాటు పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌ల హయాంలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేండ్లలో చేసి చూపించామని గుర్తు చేశారు.
రాష్ట్రంలో 12 లక్ష మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.1,00,116 ఆర్థిక సాయం చేసి పేదలను ఆదుకున్నామన్నారు. 66 లక్షల రైతు కుటుంబాలకు రూ.17 వేల కోట్లను రైతుబంధు ద్వారా వారి అకౌంట్లలో జమ చేశామని గుర్తు చేశారు. కడుపులో ఉన్న బిడ్డతోపాటు కాటికి వెళ్లే ముసలి వరకు ప్రభుత్వమే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదన్నారు. విదేశీ విద్యతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులకు ఉచితంగా రూ.20 లక్షలు చెల్లిస్తున్నామన్నారు.
Adilabad2
దేశ ప్రజలను మోసం చేసిన మోదీ
బీజేపీ అధికారంలోకొస్తే అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తామనే మోదీ మాట అబద్ధమన్నారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి నిరుపేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో 18 లక్ష మందికి ప్రైవేటు, 1.35 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వేసి ఆగస్టులో భర్తీ చేస్తామనే ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ మర్శెట్టి గోవర్ధన్, పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, ల్రైబరీ చైర్మన్ రాహుత్ మనోహార్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రమేశ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు లింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు బాలురి గోవర్ధన్‌రెడ్డి, పురుషోత్తం యాదవ్, రైతుబందు సమితి జిల్లా డైరెక్టర్లు చంద్రయ్య, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.