మంచిర్యాల, మార్చి 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రానున్న 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన(డీ లిమిటేషన్) చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలపై జోరుగా చర్చ సాగుతున్నది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉండగా.. 50 శాతం పెంచాలన్న నిబంధన మేరకు కొత్తగా 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పటవుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అదే లెక్కన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న పది నియోజకవర్గాలకు అదనంగా ఐదు నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జనగణన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ప్రాతిపదికనే కొత్త అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న పది నియోజకవర్గాలతోపాటు కొత్తగా ఐదు నియోజకవర్గాలు ఏర్పడడంతోపాటు, పాత నియోజకవర్గాల రిజర్వేషన్లు(ఎస్సీ, ఎస్టీ, మహిళలు, జనరల్) స్థానాల్లో మార్పులుంటాయన్న చర్చల నేపథ్యంలో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త నియోజకవర్గం ఏర్పడిన, ఉన్న రిజర్వేషన్ మారిన ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశాలుంటాయని పలువురు నాయకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారిపోతుందన్న చర్చ నడుస్తున్నది.
ఎంపీ స్థానంగా మంచిర్యాల?
రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, డీ లిమిటేషన్‌లో తొమ్మిది లోక్‌సభ స్థానాలు అదనంగా పెరిగే అవకాశాలున్నాయి. రాష్ట్ర జనాభా యూనిట్‌గా లోక్‌సభ స్థానాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆదిలాబాద్, పెద్దపల్లితోపాటు మరోస్థానం కొత్తగా ఏర్పాటు అవుతుందని, అది కూడా మంచిర్యాల కేంద్రంగా వచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతున్నది. ఇక జిల్లా యూనిట్‌గా కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు సమాచారం. దీంతో భౌగోళికంగా నియోజకవర్గాలు వేర్వేరు జిల్లాల్లో కాకుండా ఒకే జిల్లాలో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
2016లో కొత్త జిల్లాలు ఏర్పాటైన సమయంలో నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు ఒక జిల్లాలో, మరికొన్ని మండలాలు ఒక జిల్లాలోకి వెళ్లాయి. పరిపాలన సౌలభ్యం కోసం వీటిని మార్చాలన్న అభిప్రాయాలు ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన నార్నూర్, గాదిగూడ మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన జన్నారం మండలం మంచిర్యాల జిల్లాలో.. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలు ఆదిలాబాద్ జిల్లా లో.. మిగిలిన పెంబి, దస్తురాబాద్, కడెం మండలాలు నిర్మల్ జిల్లాలో ఉ న్నాయి. నిర్మల్ జిల్లా ముథోల్, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలు వేరే జిల్లాల్లో ఉన్నాయి. కొత్త నియోజకవర్గాల ఏర్పాటులో జిల్లాల యూనిట్‌గా తీసుకొని చేయనుండడంతో నియోజకవర్గ కేంద్రం ఒక జిల్లాలు, మండలం- గ్రామం మరో జిల్లాలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలు ఉండగా.. జనాభాను అనుసరించి కొత్తగా ఒకటి లేదా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ఉట్నూర్ లేదా ఇంద్రవెల్లి కేంద్రంగా(నార్నూర్, జైనూర్, సిరికొండ, ఇంద్రబెల్లి, ఉట్నూర్ మండలాలతో పూర్తి ఏజెన్సి నియోజకవర్గంగా ఓ నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. దీంతోపాటు ఆదిలాబాద్ రూరల్ నియోజకవర్గం తాంసి, భీంపూర్, తలమడుగు మండలాలతోపాటు జైనథ్, బేల మండలాల్లో కొంత భాగం కలుపుకొని కొత్త నియోజకవర్గం ఏర్పడవచ్చన్న చర్చ నడుస్తున్నది.
జనాభా :ప్రస్తుత అసెంబ్లీ స్థానాలు
7,08,972: 02
నిర్మల్
నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న మూడు నియోజకవర్గాలతోపాటు కొత్తగా మరో నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. నర్సాపూర్(జీ) కొత్త నియోజకవర్గంగా కుంటాల, లోకేశ్వరం, నర్సాపూర్(జీ) మండలంతోపాటు సారంగాపూర్ మండలం నుంచి కొంత భాగం కలుపుకొని కొత్త నియోజకవర్గం ఏర్పడే ఛాన్స్ ఉంది.
జనాభా :ప్రస్తుత అసెంబ్లీ స్థానాలు
7,09,418 :03
ఆసిఫాబాద్
ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్, లింగాపూర్, కెరిమెరి, సిర్పూర్(యూ) ప్యూర్ ఏజెన్సీ ప్రాంతం అంతా కలిపి ఒక నియోజకవర్గం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. మరోవైపు కౌటాల కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటూ స్థానిక ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తున్నది. ప్రస్తుతం ఉన్న ఆసిఫాబాద్ నియోజకవర్గంతోపాటు వాంకిడి, రెబ్బెన, తిర్యాణి, ఆసిఫాబాద్ రూరల్ మండలాలను కలుపుకొని రూరల్ నియోజకవర్గం అన్న చర్చ నడుస్తున్నది.
జనాభా : ప్రస్తుత అసెంబ్లీ స్థానాలు
5,15,812 : 02
మంచిర్యాల
మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారంతోపాటు హాజీపూర్ మండలాన్ని కలుపుకొని ఓ నియోజకవర్గం ఏర్పాటుకు డిమాండ్ వినిపిస్తున్నది. ఇప్పటికే లక్షెట్టిపేట నియోజకవర్గంపై స్థానికంగా అఖిలపక్షం ఏర్పాటైంది. గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న లక్షెట్టిపేటకు పూర్వవైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. డీ లిమిటేషన్‌లో లక్షెట్టిపేట కొత్త అసెంబ్లీ కావడం పక్కాగా మారింది. మరోవైపు చెన్నూర్ నియోజకవర్గంలోని మంద్రమరి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి నియోజకవర్గంలోని కొంత భాగాన్ని కలుపుకొని మరో నియోజకవర్గం ఏర్పాటు కావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జనాభా :ప్రస్తుత అసెంబ్లీ స్థానాలు
8,07,037 :03