మంచిర్యాల జిల్లాకు చేరుకున్న సర్కారు కానుకలు
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 30 : తెలంగాణ ప్రభుత్వం ఐదో విడుత బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధమైంది. మంచిర్యాల జిల్లాలో 2,84,940 మహిళలు అండగా, ఇప్పటికే 2.14 లక్షల చీరలు చేరుకున్నాయి. మిగితావి రేపో..మాపో రానున్నాయి. 25 రంగుల్లో.. 600 డిజైన్లలో బతుకమ్మ చీరలు వస్తుండగా, వాటిని పాత కలెక్టరేట్లో భద్ర పరిచారు. జిల్లాలోని 423 రేషన్ దుకాణాల ద్వారా అక్టోబర్ 4వ తేదీ నుంచి వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే కలెక్టర్ బదావత్ సంతోష్ ఆయా మండలాల తహశీల్దార్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. పంపిణీలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని కోరారు.
జిల్లాకు 2.84 లక్షల బతుకమ్మ చీరలు..
జిల్లాలోని 16 మండలాలు, ఏడు మున్సిపాలిటీల్లో మహిళలకు పంపిణీ చేసేందుకు 2,84,940 చీరలు అవసరమని అంచనా వేశారు. బెల్లంపల్లి మండలంలో 26,400 బతుకమ్మ చీరలు కేటాయించగా, భీమినికి 5,209, భీమారానికి 6,161, చెన్నూర్‌కు 20,405, దండేపల్లికి 19,787, హాజీపూర్‌కు 12,618, జైపూర్‌కు 13,038, జన్నారానికి 21,132, కన్నెపల్లికి 7,830, కాసిపేటకు 11,761, కోటపల్లికి 13,778, లక్షెట్టిపేటకు 19,354, మంచిర్యాలకు 31,571, మందమర్రికి 30,244, నస్పూర్‌కు 17,655, నెన్నెలకు 9,095, తాండూరుకు 11,730, వేమనపల్లి మండలానికి 7,172 బతుకమ్మ చీరలు అందించనున్నారు. త్వరలోనే జిల్లా కేంద్రం నుంచి ఆయా మండలాల్లోని రేషన్ దుకాణాలకు సరఫరా చేరవేసేందుకు డీఆర్డీఏ అధికారులు సిద్ధంగా ఉన్నారు. 18 ఏళ్లు పైబడిన మహిళలు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలతో రేషన్ దుకాణాలకు వెళ్లి సర్కారు కానుకలు పొందవచ్చు.
Sarees