
నిర్మల్ టౌన్, డిసెంబర్ 12 : బాయిల్డ్ రైస్ తరలింపులో కేంద్రం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాటలు కోటలు దాటినా.. చేతల్లో మాత్రం గడప దాటడం లేదు. నిర్మల్ జిల్లాలో యాసంగికి సంబంధించిన 72,412 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సర్కారు సేకరించగా, ఇందులో 49,241 మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను కేంద్రం ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వ చేసుకోవాల్సి ఉంది. ప్రతి నెలా 12వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను తరలించాల్సి ఉండగా, కేవలం 3,132 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ చెబుతున్నది. ఆన్లైన్ ద్వారా ఇండెంట్‌ను ఎప్పటికప్పుడు పంపుతున్నా అనుమతి రాకపోవడంతో నిల్వలు పేరుకుపోయి, రైస్‌మిల్లర్లతోపాటు లారీ యజమానులకూ నష్టం వాటిల్లుతున్నది.
నిర్మల్ జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో బాయిల్డ్ రైస్ సేకరించడంలో ఎఫ్‌సీఐ నిలువెత్తు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. అటు రైస్‌మిల్లర్లకు, ఇటు రైతులకు ఆందోళన కలిగిస్తున్నది. జిల్లాలో మొత్తం 9 బాయిల్డ్‌రైస్ మిల్లులున్నాయి. యాసంగికి సంబంధించిన వరి ధాన్యం 72,412 మెట్రిక్‌టన్నులను ప్రభుత్వం సేకరించింది. ఇందులో 49,241 మెట్రిక్ టన్నుల బాయిల్డ్‌రైస్ కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ గోదాముల ద్వారా నిల్వ ఉంచుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వం ధాన్యం తరలించిన గోదాముల నుంచి తిరిగి సీఎంఆర్ రూపంలో బియ్యాన్ని తీసుకోవడం లో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నది. బీజేపీ నేతల మాట లు కోటలు దాటినా చేతలు మాత్రం గడప దాటవన్నట్లుగా బాయిల్డ్‌రైస్ మిల్లుల సేకరణ రుజువు చేస్తున్నది. ప్రతినెలా 12వేల మెట్రి క్ టన్నుల బాయిల్డ్‌రైస్‌ను రైస్‌మిల్లర్ల నుంచి నిజామాబాద్ జిల్లా ద్వారా డిచ్పెల్లికి తరలించే లక్ష్యం ఉండగా.. కేవలం 3,132 మెట్రి క్ టన్నుల బియ్యం మాత్రమే తరలిస్తున్నట్లు అధికారులు పే ర్కొంటున్నారు. డిచ్పెల్లిలో బియ్యం నిల్వ చేసే గోదాముల్లో స్థలం లేకపోవడం, వ్యాగన్లు రాకపోవడంతో నిల్వలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయి. రైస్‌మిల్లులకు ప్రభుత్వం అం దించిన ధాన్యం స్థానంలో బాయిల్డ్‌రైస్‌కు 68 కిలోల చొ ప్పున తిరిగి తీసుకోనున్నారు. జిల్లాలో పెద్దఎత్తున బాయిల్డ్‌రైస్ ఎఫ్‌సీఐకి ప్రతినెలా పంపే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో రైస్‌మిల్లు గోదాముల్లో బ్యాగులు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. దీన్ని పరిరక్షించేందుకు రైస్‌మిల్లర్లు పడరానిపాట్లు పడుతున్నారు. జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారులు ఇండెంట్‌ను ఆన్లైన్ ద్వారా పంపుతు న్నా అక్కడి నుంచి బియ్యం తరలింపునకు అనుమతి రాకపోవడంతో సేకరణ ప్రశ్నార్థకంగా మారుతున్నది.
మూడు వర్గాలకు ఉపాధి కరువు..
బాయిల్డ్‌రైస్ సేకరణలో జాప్యం చోటుచేసుకోవడంతో రైతులు, రైస్‌మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. నిర్మల్ జిల్లాలో 9 ప్రాంతాల్లో యాసంగి వరి ద్వారా బాయిల్డ్‌రైస్ తయారైన వెంటనే వాటిని డిచ్‌పెల్లి గోదాములకు తరలించాలి. ఇందుకు ఎఫ్‌సీఐ ద్వారా లారీలను పంపాలి. అంటే వారం రోజులకోసారి 2-3 లారీలు మాత్రమే బియ్యం తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. బియ్యం తీసుకెళ్లినా డిచ్‌పెల్లి గోదాముల వద్ద అన్లోడ్ చేసేందుకు ఎఫ్‌సీఐ అధికారులు జాప్యం చేయడంతో లారీల యజమానులకు అద్దె భారమవుతున్నది. రైస్‌మిల్లులో పెద్దఎత్తున వరి ధాన్యాన్ని నిల్వ చేసుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు బాయిల్డ్‌రైస్‌ను ఎఫ్‌సీఐ గోదాములకు తరలిస్తే క్వింటాల్‌కు రూ.25 చొప్పున కేంద్ర ప్రభుత్వం చార్జి కింద రైస్‌మిల్లర్లకు తిరిగి చెల్లిస్తుంది. బియ్యం తరలింపు జాప్యం కారణంగా పెట్టిన పెట్టుబడికి సకాలంలో డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గోదాముల్లో రైస్‌మిల్లులకు రక్షణ లేకపోవడంతో ఆరుబయటే వరి ధాన్యం సంచులను నిల్వ చేసి తాటిపత్రులను కట్టి రక్షిస్తున్నారు. దీంతో వరి ధాన్యంలో తేమ తగ్గిపోవడం, చెడిపోవడం వంటివి జరుగుతున్నాయని రైస్‌మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాయిల్డ్‌రైస్‌ను వెంటవెంటనే ఎఫ్‌సీఐ గోదాముకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎప్పటికప్పుడు ఇండెంట్‌ను పెడుతున్నాం..
నిర్మల్ జిల్లాలో బాయిల్డ్‌రైస్‌ను ఎఫ్‌సీఐ గోదాములకు తరలించేం దుకు ఎన్ని చర్యలు తీసుకున్నా డిచ్పెల్లిలో బియ్యం నిల్వ చేసే గోదాముల్లో స్థలం లేదని పేర్కొంటున్నారు. దీంతో బియ్యం సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రతినెలా 12వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐ గోదాముకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇప్పటివరకు మూడు వేల మెట్రిక్ టన్నులకు మించి బియ్యం సరఫరా కావడం లేదు. దీనివల్ల రైస్‌మిల్లర్లకు, ఇటు లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.