స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్లో చేరికల జోరు ఊపందుకున్నది. అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో గులాబీ గూటికీ చేరుతుండగా, ఆ పార్టీల ఉనికి లేకుండా పోతున్నది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో పెద్ద సంఖ్యలో చేరికలు కొనసాగు తుండగా, శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, (నమస్తే తెలంగాణ)/ ఆసిఫాబాద్ టౌన్, రెబ్బెన/చింతలమానేపల్లి, డిసెంబర్ 7
నిత్యం ఏదో ఒక చోట
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక గ్రామం నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపొందే అవకాశాలు తక్కువగా ఉండటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో వైఫల్యం చెందడంతో సాధారణ ప్రజలతో పాటు వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో గులాబీ పార్టీలోకి వలస వస్తున్నారు. ప్రధానంగా సిర్పూర్ నియోజకవర్గంలో రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరుగకపోవడం, సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో సహజంగానే అధికార పార్టీపై ప్రజలు, యువతలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నివాసాలకు నిత్యం తరలివస్తూ గులాబీ పార్టీలో చేరుతున్నారు.
ఆదివారం ఆయాచోట్ల
ఆసిఫాబాద్ మండలం మాణిక్గూడకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఆమె వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ గ్రామాన బీఆర్ ఎస్ జెండా ఎగురవేసేలా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. రెబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని గోండుగూడలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి పర్యటించారు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
అనంతరం గ్రామస్తులు ఆమెను ఘనంగా సన్మానించారు. చింతలమానేపల్లి మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పర్యటించారు. కోయపల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తిరుపతి బరిలో ఉండగా, అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీలో ఉన్న ఐదుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అభినందించారు. సర్పంచ్ అభ్యర్థి తిరుపతిని గెలిపించాలని కోరారు. గూడెం గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చల్లూర్కర్ విజయశాంతి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. దిందా శివారులోని పోడు భూములను పరిశీలించారు. పోడు రైతులతో మాట్లాడారు. ఆర్థికంగా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. చింతలమానేపల్లి, కర్జెల్లి, బాబాపూర్, రుద్రాపూర్, బాబాసాగర్,డబ్బా, ఆడేపల్లి గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న సర్పం చ్ అభ్యర్థులు, వార్డు సభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. ఆయాచోట్ల నాయకులు మడవి పోశెట్టి, భీ ము, ఆత్రం భీము,లస్మయ్య, లక్ష్మి, బిత్రు బాయి, ఆత్రం లక్ష్మి, ఆత్రం భీం బాయి, బుజ్జి బాయి, మడావి పద్మ, ఏఎంసీ మా జీ చైర్ పర్సన్ పర్లపల్లి వనజ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మా జీ సర్పంచ్ తోట లక్ష్మణ్, గ్రామ పటేల్ జంగు పటేల్, లచ్చుపటేల్, పెద్ద లచ్చుపటేల్, సురేశ్, నగేశ్, పంబాల శ్రీనివా స్, పరికిపండ్ల సత్యనారాయణ, ప్రతా ప్, సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ సలీం, మండల అధ్యక్షుడు గోమాసే లహాంచు, మారుతి, కుకుడ్కార్ భాస్కర్,డోకే నారాయణ, ఉండ్ర శివరాం, పర్వతాల ప్రవీణ్, మార్కండేయ, సల్మాన్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.