దిలావర్పూర్, మే 14 : రైతును రాజుగా చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైతు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. రైతులకు పంటల సాగులో సరైన సమాచారం అందించి వారందనీ సంఘటితం చేసేందుకు ప్రభుత్వం నిర్మల్ జిల్లాలో మొత్తం 79 రైతు వేదికలను నిర్మించింది. ఇందులో నిర్మల్ నియోజక వర్గంలో 26, ముథోల్ నియోజక వర్గంలో 42, ఖానాపూర్ నియోజకవర్గంలో 11 ఉన్నాయి. వీటి నిర్మాణంతో రైతులు బహుళ ప్రయోజనాలు పొందుతున్నారు.
రైతు వేదికలు అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటిలో ఏఈవోలు నిత్యం అందుబాటులో ఉంటూ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. పంటలకు తెగుళ్లు సోకినప్పుడు ఆ క్లస్టర్ పరిధిలోని రైతులతో సమావేశం నిర్వహించి సస్యరక్షణ చర్యలను వివరిస్తున్నారు. మరికొంత మంది రైతులు వ్యవసా య శాఖ అధికారులు అందుబాటులో ఉండడం తో ఏ పంటలను సాగు చేయాలనే సమచారం తీ సుకుంటున్నారు. ఆ పంటలను సాగు చేస్తూ ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. రైతులకు ప్రభు త్వం అందిస్తున్న రాయితీల వివరాలను ఏఈవోలు ఎప్పటికప్పుడు రైతులకు వివరించేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నా యి. కాగా, రైతులు వేసిన పంటలను అధికారులు పరిశీలిస్తూ చీడపీడలపై సూచనలు ఇస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో రైతులు సాగు చేసిన పంటలకు తెగుళ్లు వస్తే వారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఫర్ట్టిలైజర్ దుకాణాల వారు ఇచ్చే మందులను మాత్రమే ఉపయోగించేవారు. కానీ తెలంగాణ ఏర్పాటు, రైతు వేదికల నిర్మాణంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ పంట తెగుళ్ల నివారణ చర్యలు చెబుతున్నారు. పంటలను పరిశీలించి ఏ మందులు వాడాలో సూచిస్తున్నారు. దీంతో రైతుకు పెట్టుబడి ఖర్చుకూడా తగ్గుతుందని అంటున్నారు.
రైతులు లాభసాటి పంటలు సాగు చేసేలా అవగాహన కల్పిస్తున్నాం. రైతు వేదికల్లో అందుబాటులో ఉండి రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నాం. పంటలకు తెగుళ్లు సోకినప్పుడు పంటల సస్యరక్షణ చర్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు రైతులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీవాణి ఏవో గుండంపల్లి
మా ఊరిలో ఉన్న రైతు వేదికలో ప్రతి నెలా మంగళవారం రైతులందరం కలిసి సమావేశం పెట్టుకుంటాం. వ్యవసాయ శాఖ అధికారులు రోజూ అందుబాటులో ఉంటారు. ఇటీవల వరి పంటకు తెగుళ్లు వచ్చినప్పుడు ఏఈవోకు చెబితే పరిశీలించి సస్యరక్షణ చర్యలు వివరించారు. ప్రభుత్వం అందించే పథకాలపై మాకు ఏఈవో వివరిస్తున్నది. ఏ పంటలు సాగు చేస్తే దిగుబడి వస్తుందో తెలుసుకొనడంతో లాభసాటిగా ఉంటుంది.
– భోజన్న, రైతు, గుండంపల్లి