మనిషి జీవించడానికి కూడు, గూడు, గుడ్డ అత్యంత ప్రధానం. ఇందులో గూడును సబ్బండ వర్గాల ప్రజలకు సాకారం చేయడానికి రాష్ట్ర సర్కారు సంకల్పించింది. ఒకవైపు సకల సౌకర్యాలతో ఉచితంగా డబుల్ బెడ్రూంలు కట్టి ఇస్తుండగా.. మరోవైపు ఇంటి స్థలం ఉన్న నిరుపేదలకు రూ.3 లక్షలు వంద శాతం రాయితీతో ఇవ్వాలని దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 8,9,10 తేదీల్లో గ్రామ, మున్సిపాలిటీల్లో అర్జీలను స్వీకరించగా.. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 53,333 వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించేందుకు 113 బృందాలను ఏర్పాటు చేశారు. పట్టణాల్లో వార్డు అధికారులు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బందితో పాటు గ్రామాల్లో డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ఈనెల 28 వరకు కొనసాగనుండగా.. అనంతరం అర్హులను ప్రకటిస్తారు. నిర్మల్ జిల్లాలో నియోజకవర్గానికి 3 వేల చొప్పున. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు 7,800 ఇండ్లు మంజూరయ్యాయి.
-నిర్మల్ అర్బన్, ఆగస్టు 19
నిర్మల్ అర్బన్, ఆగస్టు 19 : పేదల సొంతిటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో నిరుపేదలను గుర్తించి, వేల కోట్లతో నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల్లో 7 వేల ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటికే 80 శాతం మందికి పంపిణీ చేయడంతో వారు సొంతింట్లోకి నివాసం ఉంటున్నారు. సొంత స్థలం ఉన్నవారికి, డబుల్ బెడ్రూం తీసుకోని వారి ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం గృహలక్ష్మి పథకం అమలుచేస్తున్నది. ఇందులో భాగంగా రూ.3 లక్షల సాయం అందించనున్నది. మొదటి విడుతగా ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 53,333 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో 17,233, ముథోల్‌లో 25,170, ఖానాపూర్‌లో 10,930 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో కుభీర్ మండలం నుంచి అధికంగా (5,701) దరఖాస్తు రాగా.. అత్యల్పంగా ఖానాపూర్ పట్టణం నుంచి (983) వచ్చినట్లు తెలిపారు. ఇందులో సోన్ మండలంలో 1104, దిలావర్పూర్లో 1228, లక్ష్మణచాందలో 1434, నిర్మల్ రూరల్‌లో 1431, మామడలో 3332, నర్సాపూర్ (జీ)లో 1613, సారంగాపూర్‌లో 3497, నిర్మ ల్ మున్సిపాల్టీలో 3594, ముథోల్‌లో 2807, కుభీర్‌లో 5701, భైంసా మున్సిపాల్టీలో 3038, భైంసా రూరల్‌లో 3364, లోకేశ్వరంలో 2139, కుంటాలలో 2141, బాసరలో 1346, తానూరులో 4634, కడెంలో 3146, పెంబిలో 2309, దస్తూరబాద్లో 1701, ఖానాపూర్ మున్పిపాల్టీలో 983, ఖానాపూర్ రూరల్‌లో 2791 దరఖాస్తులు వచ్చాయి.
113 బృందాల ఏర్పాటు..
జిల్లాలోని 18 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు అధికారులతో సర్వే నిర్వహిస్తున్నా రు. పట్టణాల్లో వార్డు అధికారులు, ఆర్పీలు, ము న్సిపల్ సిబ్బందితో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ సి బ్బందితో సర్వే చేస్తున్నారు. ఇందుకు అధికారు లు 113 బృందాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో సర్వే చివరి దశలో ఉండగా, మండలాల్లో కొనసాగుతున్నది. ప్రాథమికంగా నిర్వహించిన తర్వాత పట్టణ పరిధిలో పట్టణ ప్ర ణాళికాధికారి, ఆర్ఐ, మండల పరిధిలో ఎంపీడీవో, ఎంపీవో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు. అర్హులను ప్రకటిస్తారు.
జిల్లాలో 7,800 లబ్ధిదారులకు ఇండ్లు..
గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి 3 వేల ఇండ్లను మంజూరు చేశారు. రిజర్వేషన్ ప్రకారం లబ్ధిదారులనే ఎంపిక చేయనున్నారు. ఇందులో ప్రతీ నియోజకవర్గానికి ఎస్సీలకు 20, ఎస్టీలకు 10, బీసీ, మైనార్టీలకు 50, దివ్యాంగులకు 5, జనరల్ 15 శాతం ప్రకారం కేటాయించారు. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలకు మూడు వేల ఇండ్ల చొప్పున అందించనుండగా, ఖానాపూర్లోని 4 మండలాలకు 1800 ఇండ్లను అందించనున్నారు.