మంచిర్యాల, జూలై 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ(సర్) నెమ్మదిగా కొనసాగుతున్నది. దీనిపై పట్టణాలు, గ్రామాల్లో అవగాహన లేక అవస్థలు పడుతున్నారు. జూన్ 25వ తేదీన ప్రక్రియ ప్రారంభం కాగా జూలై 24వ తేదీ వరకు కొనసాగనున్నది. బీఎల్వోలు దరఖాస్తులను ఓటర్లకు అందిస్తున్నారు. ఈ బీఎల్వోలుగా అంగన్వాడీ టీచర్లు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ప్ సీఏలు వ్యవహరిస్తున్నారు. ఫారాలను బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఇవ్వాల్సి ఉండగా ఒకేచోట కూర్చొని ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓటర్లకు సమాచారం అందించి తాము ఉన్న చోటికే పిలుపించుకొని ఫారాలు పంపిణీ చేస్తున్నారు.
ఈ దరఖాస్తులు కొందరికి అందుతుండగా.. మరికొందరికి అందకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. బీఎల్వో లు మాత్రం ఓటర్లకు ఫారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ పత్రాలను ఎ లా పూరించాలో తెలియక జనం అవస్థలు ప డుతున్నారు. నిరక్షరాస్యులైతే అక్షరాస్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. పట్టణాల్లో కొంత మెరుగ్గా ఉన్నా.. పల్లె ప్రాంతాల్లో మరీ దారుణంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ప ర్యవేక్షించేవారు క్షేత్రస్థాయిలో లేకపోవడం వల్ల ఫారాలు జనాలకు ఇచ్చే కార్యక్రమం మాత్ర మే కొనసాగుతుండగా, ఫారాలు నింపి అందచేసే బాధ్యత మాత్రం ముందుకు సాగడం లేదు. కీలకమైన ఈ కార్యక్రమంపై బీఎల్వోలు, క్షేత్రస్థాయిలో అధికారులు సరైన దృష్టి పెట్టకపోవడంతో సామన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

బీఎల్వోలకు అవగాహన లేమీ..
సర్ పత్రాలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తున్న బీఎల్వోలకు కార్యక్రమంపై అవగాహన లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొన్నది. అధికారుల ఒత్తిడి మేరకు ఫారాలను పంచుతున్న బీఎల్వోలను ఏమైన సందేహం అగిడితే మాకేం తెలుసు అనే సమాధానం వినిపిస్తున్నది. కొంతమంది బీఎల్వోలు సహాయకులను ఏర్పచుకొని కార్యక్రమం కొనసాగిస్తుండగా, మరికొంత మంది తలలు పట్టుకొని కార్యక్రమాన్ని ముందుకు ఎలా సాగించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
డిజిటలైజేషన్లో వెనకడుగు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా టాప్లో ఉండగా మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 18.25 శాతంతో ప్రథమ స్థానంలో ఉంది. మంచిర్యాల జిల్లా 2.69, నిర్మల్ జిల్లా 2.99, ఆదిలాబాద్ 4.46 శాతంతో ఉన్నాయి. ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో 98.2 శాతం, ఆదిలాబాద్లో 96.41, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 96.31, మంచిర్యాలలో 86 శాతం ఫారాల పంపిణీ పూర్తయింది.