నిర్మల్, జూలై 14(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ గందరగోళంగా తయారైంది. నకిలీ ఓట్లను తొలగించి, అసలైన ఓటర్లను గుర్తించి, 2002 నాటి ఓటరు జాబితా వివరాలతో మ్యాపింగ్ చేస్తూ కొత్త జాబితా రూపొందించాలన్న ఎన్నికల సంఘం ఆశయం లోపాల కారణంగా పక్కదారి పడుతున్నది. ముఖ్యం గా చాలాచోట్ల ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ సక్రమంగా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు మాత్రం 100 శాతం ఫారాలు పంపిణీ చేశామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పట్టణాల్లోని అనేక కాలనీల్లో మా ఇంటికి బీఎల్వోలు రాలేదు, మాకు అందాల్సిన ఫారాలు ఎటు పోయాయి? అంటు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్వో) తమ పరిధిలోని ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయాలి.
అనంతరం భర్తీ చేసిన ఫారాలను సేకరించి, డిజిటలైజేషన్ చేయాయి. కానీ.. నిర్మల్ జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. చాలా చోట్ల బీఎల్వోలు కాలనీల్లోని ఏదో ఒక అనుకూలమైన చోట కూర్చుంటుండగా, సమాచారం తెలిసి అక్కడికి వచ్చిన వారికి మాత్రమే ఫారాలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల బీఎల్వోలు ఎక్కడున్నారో తెలియక, ఫారాల కోసం స్థానికులు కాలనీల వెంబడి గాలించాల్సిన పరిస్థితి ఉంది. రోజూవారి పనులకు వెళ్లేవారు, వృద్ధులు, మహిళలకు అసలు ఫారాలే అందడం లేదు. ఫారాలు దొరికిన వారు కూడా వాటిని ఎలా పూరించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా 2002 నాటి పోలింగ్ బూత్ నంబర్, సీరియల్ నంబర్ ఆన్లైన్లో వెతికినా కొంతమంది వివరాలు లభ్యం కాకపోవడంతో ఫారాలను నింపలేక సాధారణ ఓటర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఎన్యుమరేషన్ ఫారాలు అందక ఒకవైపు సామాన్య ఓటర్లు అవస్థలు పడుతుంటే, మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉన్న లొసుగులను కొందరు అక్రమార్కులు ఆసరాగా చేసుకుంటున్నారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నవారు.. తమ అన్ని ఓట్లను పదిలంగా ఉంచుకొనేందుకు పక్కా ప్లాన్ అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న కొంతమంది కొత్త ఎత్తుగడలతో అధికారులనే బురిడీ కొట్టిస్తున్నారు. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
నిర్మల్ పట్టణంలోని 12వ వార్డుతోపాటు 28వ వార్డులోనూ ఓటు హక్కు కలిగి ఉన్న ఒక వ్యక్తిని తీసుకుంటే.. అతను రెండు చోట్లా ఓట్లు పోకుండా అధికారులను మాయ చేస్తున్నాడు. 12వ వార్డులో ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారంలోని రెండో భాగంలో.. 2002 నాటి తన తండ్రి వివరాలను (నాటి పోలింగ్ స్టేషన్ నంబర్, సీరియల్ నంబర్) నమోదు చేసి దరఖాస్తు సమర్పిస్తాడు. అదే వ్యక్తి 28వ వార్డులో ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారంలో తండ్రి స్థానంలో తన తాత, తల్లి, లేదా నానమ్మ, అమ్మమ్మకు సంబంధించిన 2002 నాటి వివరాలను రాసి బీఎల్వోలకు అందజేస్తున్నాడు. ఆయా వార్డుల్లో వేర్వేరు కుటుంబ సభ్యులతో మ్యాపింగ్ చేయడం వల్ల సాఫ్ట్‌వేర్‌లో లేదా అధికారుల పరిశీలనలో వీరు రెండు చోట్ల దరఖాస్తు చేసుకున్నట్లు తెలియడం లేదు.
ఈ డబుల్ ఓటర్ల ఆటలు సాగడానికి ఎన్యుమరేషన్ ఫారంలో ఆధార్ నంబర్ కచ్చితంగా రాయాలన్న నిబంధన లేకపోవడమే ప్రధాన కారణం. ఆధార్‌ను ఐచ్ఛికం(ఆప్షనల్) చేయడంతో అక్రమార్కులకు రెండు చోట్లా ఆధార్ వివరాలు పొందుపరచడం లేదు. ఒకవేళ ఆధార్ లింక్ ఉంటే సాఫ్ట్వేర్ ఈజీగా డూప్లికేట్ ఓట్లను పసిగట్టేది. కానీ.. ఆ నిబంధన లేకపోవడంతో రెండు వార్డుల్లోనూ వేర్వేరు ఫ్యామిలీ హిస్టరీ చూపిస్తూ డబుల్ ఓట్లను యథావిథిగా ఉంచుకొనేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. దీనిని పసిగట్టే కనీస సాంకేతిక ఏర్పాట్లు గానీ, క్షేత్రస్థాయి నిఘా గాని లేకపోవడంతో కొంతమంది అక్రమార్కులకు వరంగా మారింది. అయితే ఈ అక్రమాలను ముందే పసిగట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉండి, కావాలని వివరాలు దాచిపెడితే ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తామని ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అయినా సరే ఇక్కడి అక్రమార్కుల్లో చలనం కనిపించడం లేదు.
పొరుగు దేశాల నుంచి ఇక్కడికి అక్రమంగా వలస వచ్చి ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిని ఏరివేసేందుకు, అలాగే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, మరణించిన వారి ఓట్లను తొలగించేందుకు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కొంతవరకు ఉపయోగ పడుతున్నప్పటికీ, స్థానికంగా ఉంటూ ‘డబుల్ గేమ్’ ఆడుతున్న ఇంటి దొంగలను పట్టుకోవడం మాత్రం అధికారులకు కత్తిమీద సాములా మారింది. జిల్లా అధికారులు ఈ డూప్లికేట్ ఓట్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాగే బీఎల్వోలు కచ్చితంగా ప్రతి ఇంటికీ వెళ్లేలా నిఘా పెట్టాలని కోరుతున్నారు. ఒకే పేరు, పోలికలు ఉన్న ఓటర్ల దరఖాస్తులను క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో రీ-వేరిఫికేషన్ చేయాలని, లేదంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆశించిన పారదర్శకత నిర్మల్ జిల్లాలో కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందంటున్నారు.
నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని కార్పొరేట్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఓట్లను పదిలంగా ఉంచుకొనేందుకు రెండు రోజుల క్రితం తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకొనేందుకు నిర్మల్‌కు వచ్చాడు. బీఎల్వోలు ఎవరూ కూడా ఇంటికి రాలేదని, ఇప్పటి వరకు ఫారాలు ఇవ్వలేదని తల్లిదండ్రులు చెప్పడంతో చుట్టుపక్కల వారిని సంప్రదించి ఫారాలు ఇచ్చే చోటును కనుక్కొన్నాడు.
భాగ్యనగర్ కాలనీ వాసుల ఫారాలను మరో కాలనీ అయిన ప్రియదర్శినీ నగర్లో గల ఓ అసోసియేషన్ కార్యాలయంలో ఇస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్లాడు. దాదాపు రెండు గంటలపాటు అక్కడ నిరీక్షిస్తే నలుగురు కుటుంబ సభ్యుల్లో ముగ్గురివి మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చారు. దాదాపు 70 ఏళ్ల వయసు ఉన్న తన తండ్రికి సంబంధించిన ఫారం లేదని చెప్పడంతో ఆయన చేసేదేమి లేక వెనుదిరిగాడు.
నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు విద్యా సంస్థ నిర్వాహకుడు కూడా ఇప్పటివరకు తమ ఇంటికి బీఎల్వోలు ఎవరూ రాలేదని, ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వలేదని చెబుతున్నాడు. ఫారాలు ఎక్కడ ఇస్తున్నారంటూ వాకబు చేయడం కనిపించింది. ఇలా విద్యావంతులకే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, ఎస్ఐఆర్ ప్రక్రియను గట్టెక్కేందుకు సాధారణ ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.