ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా మారింది. మొదటి, రెండు విడుతల్లో విడుదల చేసిన జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, అసమ్మతి సెగలతో అట్టుడికిపోతున్నది. ఆయాచోట్ల టికెట్లు ఆశించిన వారికి హ్యాండివ్వగా, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని జనాల్లోకి వెళ్తామంటూ వారంతా వాపోతున్నట్లు తెలుస్తున్నది. ఉన్నఫలంగా వీరెవరూ పార్టీకి సహకరించే అవకాశం లేదు. ఇక పొత్తుల్లో భాగంగా చెన్నూర్ టికెట్‌ను సీపీఐకి కేటాయించగా, ఇక్కడ బీఆర్ఎస్ గెలుపు నల్లేరుమీద నడక కానున్నది. ఇక మిగతా చోట్ల అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారగా, ‘కారు’ గెలుపు దాదాపు ఖాయమైందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
– మంచిర్యాల, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి హస్త‘వ్యస్తం’గా మారింది. అసమ్మతి సెగలతో పార్టీ అట్టుడికిపోతున్నది. రెండో జాబితా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో 9 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. చెన్నూర్ నియోజకవర్గం మాత్రం పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తున్నది. ఇదే జరిగితే ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు సునాయసం కానుంది. మంచిర్యాల జిల్లాలో మిగిలిన రెండు మంచిర్యాల, బెల్లంపల్లిలో ఫస్ట్ లిస్ట్‌లోనే అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన నాయకులు పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మంచిర్యాలలో టికెట్ ఆశించి భంగపడిన ఆ పార్టీ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్తె సత్తయ్య ఇప్పటికే బీఆర్ఎస్లో చేరారు. దీంతో లక్షెట్టిపేట మండలం మొత్తం బీఆర్ఎస్ బలం పెరిగింది. ఇక టికెట్ ఆశించిన మరో నేత కేవీ ప్రతాప్, బీసీలకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ నుంచి తనకే ఇవ్వాలని కోరిన డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ లాంటి కీలక నేతలు కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్‌కు రావు కోసం జనంలో తిరగడం లేదు. ఇక మిగిలిన కిందిస్థాయి లీడర్లు కూడా గొడవకు దిగుతున్నారు. దీంతో మంచిర్యాలలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక బెల్లంపల్లి టికెట్ గడ్డం వినోద్‌కు ఇవ్వడంతో అక్కడ ప్రేమ్‌సాగర్‌రావు వర్గంగా ఉన్న నాతరి స్వామి వర్గం అలకపూనింది.
ప్రస్తుతం పార్టీలో ఉన్న వారు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి. అదే జరిగితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పడే కొన్ని ఓట్లు కూడా గల్లంతు అవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇక చెన్నూర్ నియోజకవర్గంలో దాదాపు 14 మంది నాయకులు కాంగ్రెస్ టికెట్ అడిగారు. వారిలో మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, డాక్టర్ రాజా రమేశ్, రామిండ్ల రాధిక లాంటి ముఖ్యమైన నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నఫలంగా టికెట్ సీపీఐకి ఇస్తుండటంతో వీరెవరూ సహకరించే పరిస్థితులు లేవు. పైగా అంతా కలిసి కాంగ్రెస్ నుంచి ఓ రెబల్ అభ్యర్థిని బరిలోకి దించాలనే యోచనలో ఉన్నారు. ఇలా మంచిర్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మంట్లలోని కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారిపోయింది.
ఆసిఫిబాద్ టికెట్ శ్యామ్ నాయక్‌కు ఇవ్వడంతో మర్సకోల సరస్వతి వర్గం మండిపడుతున్నారు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడిన ఆమెను కాదని ఆయనకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. సరస్వతికే టికెట్ ఇవ్వాలంటూ ఇప్పటికే నియోజకవర్గంలో పలుచోట్ల భారీ ధర్నాలు చేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌కు వెళ్లి మరీ శ్యామ్‌నాయక్‌కు టికెట్ ఇవ్వొద్దని ఆందోళన చేశారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం సరస్వతి వర్గానికి మింగుడు పడడం లేదు. దీంతో సరస్వతి వేరే పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
ఇదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి డాక్టర్ గణేశ్ రాథోడ్, ప్రేమ్‌సాగర్ రావు తమ్ముడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్‌లు సైతం శ్యామ్‌నాయక్‌కు మద్దతుగా నిలిచే పరిస్థితి లేదు. ఇన్ని రోజులు టికెట్ తమకే వస్తుందని చెప్పుకుంటూ తిరిగి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని జనంలోకి వెళ్లాలని వారు వాపోయినట్లు తెలిసింది. సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ రావి శ్రీనివాస్‌కు ఇచ్చారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపే పరిస్థితి లేదు. బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మేలు చేసేందుకే అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను డమ్మీ అభ్యర్థికి ఇస్తారనే ముందు నుంచి ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు టికెట్‌ను రావి శ్రీనివాస్‌కు ఇచ్చారు. కోరళ్ల కృష్ణారెడ్డి, యూనిస్‌లలో ఎవరికి టికెట్ ఇచ్చినా కొంత వరకు బాగుండేందని చెబుతున్నారు.
నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గ టికెట్‌ను వెడమ బొజ్జుకు ఇచ్చారు. దీంతో టికెట్ కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరిన రేఖానాయక్ ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ కోసం ఆమె పని చేసే పరిస్థితి కనిపించడం లేదు. టికెట్ తనకే వస్తుందని ప్రెస్మీట్లు పెట్టి మరీ చెప్పిన ఆమె బొజ్జుకు టికెట్ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. దీంతో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు విజయ అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి. దాదాపు ఓ 15 మంది ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. వీరెవరూ ఇప్పుడు పార్టీకి పనిచేసేలా లేదు.
ఇక ముథోల్ నియోజకవర్గం నుంచి కిరణ్ కామ్రేవార్ మొదటి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. ప్రచారం కూడా చేసుకున్నారు. పార్టీ కోసం కష్టపడుతూ వచ్చారు. తీరా ఆయన్ని కాద ని నిన్న, మొన్న పార్టీలో చేరిన నారాయణరావు పటేల్‌కు టికెట్ ఇచ్చారు. దీంతో కిరణ్ కామ్రేవార్ కాంగ్రెస్ అధిష్టానం మీద తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఆయనగానీ, అనుచరులు గానీ కాంగ్రెస్ కోసం బయటకు వచ్చి పనిచేసే పరిస్థితి లేదు.
ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి విచిత్రంగా తయారైంది. ఆదిలాబాద్‌లో కంది శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో ముందు నుంచి పార్టీ కోసం పని చేసిన సాజిద్ ఖాన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, మాజీ మంత్రి రాంచందర్‌రెడ్డి అల్లుడు సంజీవ్‌రెడ్డి టికెట్ ఆశించారు. వీరి ముగ్గురిని కాదని ఆరునెలల క్రితం పార్టీలోకి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈయనకు టికెట్ ఇవ్వొద్దంటూ గాంధీ భవన్‌కు వెళ్లి మరీ సాజిద్ ఖాన్ వర్గం ధర్నా చేశారు.
ఇప్పుడు శ్రీనివాస్‌రెడ్డినే ఖరారు చేయడంతో వీళ్లు ముగ్గురు ఇప్పుడు కాంగ్రెస్‌కు పని చేసే పరిస్థితి లేదు. బోథ్ నియోజకవర్గం నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నరేశ్ జాదవ్, ఆడె గజేందర్ టికెట్ ఆశించారు. టికెట్ ఇస్తారనే నమ్మకంతో ఈ మధ్యే కాంగ్రెస్‌లో చేరిన రాథోడ్ బాపురావ్కు సైతం మొండి చేయి చూపించారు. వెన్నెల అశోక్‌కు టికెట్ కేటాయించినప్పుటికీ వీళ్లు ఎవరూ ఆయనకు సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.