
నార్నూర్, డిసెంబర్ 23 : గ్రామీణ స్థాయిలో అంగన్వాడీ టీచర్ల సేవలు అభినందనీయమని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సేవాలాల్ భవనంలో నార్నూర్ ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు జడ్పీ చైర్మన్‌ను శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు గ్రామాల్లో అందించే సేవలు సంతృప్తినిస్తున్నాయని తెలిపారు. పోషకాహార లోపం లేకుండా కృషి చేయడం గర్వంగా ఉందన్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. అనంతరం విధి నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఏడుగురు అంగన్వాడీ టీచర్లను సీడీపీవో శారద ఎంపిక చేయగా వారికి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్‌ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు వందన, లక్ష్మి, జీవవైవిధ్య కమిటీ జిల్లా సభ్యుడు మర్సుకోల తిరుపతి, సిబ్బంది అనిల్, తదితరులు పాల్గొన్నారు.