సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 30 : ‘మా అమ్మ ఎక్కడికెళ్లింది.. నాకు అమ్మ కావాలి..’ అంటూ పీఎంపీ వైద్యం వికటించి మృతి చెందిన శ్రీలత.. నాలుగేళ్ల కూతురు అన్విత రోదించడం అందరినీ కలచివేసింది. నస్పూర్ నాగార్జునకాలనీకి చెందిన చింతం శ్రీలత ఈ నెల 29న మృతి చెందగా, ఆదివారం అర్ధరాత్రి మృతదేహాన్ని నస్పూర్‌లోని జయశంకర్కాలనీలో నివాసముంటున్న ఆమె తల్లిదండ్రుల ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.
కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. తల్లికోసం చిన్నారి పరితపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కాగా, ఎలాంటి గొడవలు జరగకుండా మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, రూరల్ సీఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో గోదావరికాలనీ, నాగార్జునకాలనీల్లో సీసీసీ, శ్రీరాంపూర్, హాజీపూర్ ఎస్ఐలతో భారీ బందోబస్తు నిర్వహించారు. మరోవైపు మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గోదావరికాలనీలో పీఎంపీ ప్రశాంత్ నడిపించే క్లినిక్ వద్దకు వచ్చి వివరాలను సేకరించారు.
ఆర్ఎంపీ వైద్యుడి రిమాండ్
శ్రీలత మృతికి కారణమైన ఆర్ఎంపీ వైద్యుడు బిరుదల ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌లోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో సీసీసీ నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఆర్ఎంపీపై కేసు
వాంకిడి,సెప్టెంబర్ 30 : మండలంలోని ధాబా గ్రామంలో అనుమతులు లేకుండా వైద్యం చేస్తూ మందులు అమ్ము తున్న ఆర్ఎంపీ వైద్యుడు కొండల్ సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు వాంకిడి ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. సోమవారం గ్రామానికి వెళ్లి తనిఖీలు నిర్వహించామని, రూ. 15 వేల విలువైన మందులను స్వాధీనం చేసుకొని డ్రగ్ ఇన్స్పెక్టర్ అశ్వినికి అప్పగించామని తెలిపారు. అనంతరం వైద్యుడిని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.