“పోడు భూములకు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాకు సీఎం వచ్చి అందించాలని కోరుతున్నాం. ఇందుకోసం సమావేశంలో సభ్యులం కలిసి తీర్మానం చేశాం.” అని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొ న్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికా రులకు సూచించారు. ఇటీవల కేసీఆర్ నేతృత్వంలో ఉత్సవాల నిర్వహణపై చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా.. అజెండాలో భాగంగా పంచాయతీ రాజ్, వైద్యారోగ్యం, రిమ్స్, మిషన్ భగీరథ, సంక్షేమ శాఖల, విద్య, వ్యవసాయం, మార్కెటింగ్ శాఖల అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు.
ఎదులాపురం, మే 24: పోడు భూములకు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం పై హర్షం వ్యక్తం చేస్తూ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో పట్టాల పంపిణీకి సీఎం రావాలని ఆదిలాబాద్ జడ్పీ సర్వసభ్య సమావే శంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. జిల్లాలో రాష్ర్టావతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై చర్చించామని పేర్కొన్నారు.
కాగా, సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చి పోడు భూముల పట్టాలను ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించాలని కోరుతున్నామన్నారు. ఇందుకోసం సమావేశ సభ్యులు తీర్మానం చేసి పంపిస్తామని తెలిపారు. సమావేశంలో చర్చించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిస్థాయిలో దూరం చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో తమ దృష్టికి వచ్చిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. దళిత బంధు లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించామని వెల్లడించారు.
అనంతరం ఆయా శాఖల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎజెండాలో భాగంగా పంచాయతీ రాజ్, వైద్యారోగ్యం, రిమ్స్, మిషన్ భగీరథ, సంక్షేమం, విద్య, వ్యవసాయం, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. నార్నూర్, గాదిగూడలో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణాల విషయంలో అధికారుల తీరుపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం జీపీ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అధికారులు భవనాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, జడ్పీ సీఈవో గణపతి, జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు తాటిపెల్లి రాజు, ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు తుల శ్రీనివాస్, జడ్పీటీసీలు అనిల్ జాదవ్, మల్లెపూల నర్సయ్య, గోక గణేశ్ రెడ్డి, తుమ్మల అరుంధతి, పవార్ అక్షిత, వివిధ శాఖల జిల్లా అధికారులు కిషన్, రాథోడ్ నరేందర్, జైసింగ్ రాథోడ్, రాజలింగు, సునీతా కుమారి, కృష్ణవేణి, శంకర్ పాల్గొన్నారు.
జిల్లాకు జాతీయ స్థాయిలో 3వ స్థానం
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా నీటి వనరుల సంరక్షణ, నిర్వహణ విభాగంలో జిల్లాకు జాతీయ స్థాయిలో 3వ స్థానం లభించినందుకు కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులకు కలెక్టర్ రాహుల్రాజ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.