సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శ్రీరాంపూర్ ఓసీపీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లనుంది. నెల రోజుల నుంచే మట్టి తవ్వకాలు, రవాణా(ఓవర్ బర్డెన్) పనులను సీఆర్ఆర్ సంస్థ నిలిపివేసింది. ఇదే ఓసీపీలో ఓవర్ బర్డెన్ పనులు చేసే మరో సంస్థ జీవీఆర్ కూడా పని చేయలేమంటూ నెల రోజుల ముందే సంస్థకు, పని చేసే కార్మికులకు నోటీసులు ఇచ్చింది. దీంతో అక్టోబర్ 1వ తేదీ నుంచి ఓసీపీలో రెండు కాంటాక్ట్ సంస్థలు మట్టి తవ్వకాలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. రెండు సంస్థలు చేతులెత్తేయడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం నెలకున్నది. దీంతో అధికారులు మరో టెండర్‌కు డీపీఆర్ పూర్తి చేసి సింగరేణి యాజమాన్యానికి పంపించారు. ఆగమేఘాల మీద టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి, అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభించడానికి కనీసం నాలుగు నెలల సమయం పట్టనుంది. ఓసీపీలో ఇలా పూర్తిస్థాయి సంక్షోభం రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
– మంచిర్యాల, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తొలిసారి దెబ్బకొట్టిన రెండు టెండర్ల విధానం
సింగరేణి వ్యాప్తంగా బొగ్గు దాదాపు 80 శాతం ఓసీపీల నుంచే వస్తున్నది. ఇందులో కాంటాక్ట్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. ఇలా ఓసీపీల్లో మట్టి తవ్వకాలు, రవాణా చేసేందుకు గతంలో ఒకే కాంటాక్ట్ సంస్థకు టెండర్ అప్పగించే వారు. ఒకవేళ ఆ ఒక్క సంస్థ పని చేయని పరిస్థితుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఉండేందుకు యాజమాన్యం ప్రత్యామ్నాయంగా రెండు టెండర్ల విధానాన్ని అమలు చేస్తూ వస్తున్నది. దీంతో ఒక్కో ఓసీపీలో రెండేసి సంస్థలకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు.
అంటే సింగరేణి వ్యాప్తంగా 20 ఓసీపీల్లో 40 కాంటాక్ట్ సంస్థలు మట్టి తవ్వకాలు, రవాణా చేస్తున్నాయి. దీంతో ఒక సంస్థ పనులు ఆపేసినా, రెండో సంస్థ ఆ పనులు చేస్తున్నది. శ్రీరాంపూర్ ఓసీపీలో తొలిసారి రెండు కాంటాక్ట్ సంస్థలు పని చేయలేమని చేతులు ఎత్తేయడంతో సంస్థకు తీవ్రమైన నష్టం వాటిల్లనుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని యాజమాన్యం గ్రహించపోవడం, అనుభవం లేని సంస్థలకు టెండర్లు అప్పగించడం, మట్టి తవ్వకాలు, బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తక్కువకు కోట్ చేయడంతోనే ఇబ్బందులు
శ్రీరాంపూర్ ఓసీపీలో 722.75 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు, రవాణా చేసేందుకు టెండర్ పిలిచారు. ఇందుకు రూ.332 కోట్లకు సీఆర్ఆర్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారు. టెండర్ సమయంలో సింగరేణి యాజమాన్యం క్యూబిక్ మీటర్‌కు రూ.53 ధర ఆఫర్ చేయగా, సీఆర్ఆర్ సంస్థ మైనస్ కోడ్ చేస్తూ రూ.43కే క్యూబిక్ మీటర్ తవ్వేందుకని టెండర్ దక్కించుకుంది. గడిచిన ఐదు నెలల్లో సీఆర్ఆర్ సంస్థ 80 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు కేవలం 51 లక్షలు క్యూబిక్ మీటర్ల(63శాతమే) మట్టి తవ్వింది.
టార్గెట్ చేరుకోకపోవడం, పనులు భారంగా మారడంతో దాదాపు రూ.40 కోట్లు నష్టపోయామని, ఇక మేము పనులు కొనసాగించలేమని ఆగస్టు 24వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పనులు నిలిపివేసింది. జీవీఆర్ సంస్థ మూడేండ్ల కాలపరిమితికి 496 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు, రవాణాకు సంస్థ ఆఫర్ చేసిన రేట్ రూ.49కి మైనస్ టెండర్ రూ.41లకు వేసి టెండర్ దక్కించుకున్నది. దీంతో ఏడాది కాలంగా నష్టాల్లోనే నెట్టుకొస్తున్నామని, అక్టోబర్ నుంచి పనులు చేయలేమంటూ యాజమాన్యంతోపాటు కార్మికులకు నోటీసులు జారీ చేసింది.
ఈ రెండు సంస్థలకు గతంలో బొగ్గు పరిశ్రమల్లో పని చేసిన అనుభవం లేదు. తక్కువకు టెండర్ కోట్ చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీరాంపూర్ ఓసీపీలో రోజు 20 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు, 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి. ప్రస్తుతం రెండు సంస్థలు చేతులు ఎత్తేయడంతో యాజమాన్యమే ఆ పనులు చేపట్టాల్సిన దుస్థితి నెలకొన్నది. సింగరేణి సంస్థకు కేవలం బొగ్గు తీసి రవాణా చేసే సామగ్రి, మ్యాన్ పవర్ మాత్రమే ఉండడంతో ఎంత కష్టపడినా రోజుకు రెండు వేల టన్నుల నుంచి మూడు వేల టన్నుల బొగ్గు మాత్రమే తీయగలరు.
అంటే ప్రతి రోజు 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి తక్కువ అవుతుంది. ఇలా నెల రోజులకు దాదాపు రూ.100 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడనున్నది. మూడో టెండర్ దక్కుంచుకొని కాంట్రాక్ట్ సంస్థ పనులు చేపట్టడానికి నాలుగు నుంచి ఐదు నెలలు పట్టొచ్చు. ఆ కాలానికి దాదాపు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉంది. బొగ్గు ఉత్పత్తి తగ్గడంతోపాటు ఓసీపీలో పని చేస్తున్న సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులు 800 మందిపై అదనపు పని ఒత్తిడి పడనుంది. ఇక ఆ పనులు చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఈ 800 మందికి పని లేకుండా పోయే అవకాశాలు లేకపోలేదు.
కాంట్రాక్ట్ సంస్థలతో చర్చలు
శ్రీరాంపూర్ ఓసీపీలో పనులు చేస్తున్న రెండు కాంటాక్ట్ సంస్థలు పనులు ఆపేయకుండా సింగరేణి యాజమాన్యం కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నది. మూడో టెండర్ ఫైనల్ అయ్యే వరకైనా నాలుగైదు నెలలపాటు పనులు కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిసింది. దానికి సదరు సంస్థలు అంగీకరించడం లేదని సమాచారం. మట్టి రవాణా చేసే వాహనాల డీజిల్ సింగరేణి సంస్థ భరిస్తే, పనులు చేసేందుకు కాంటాక్ట్ సంస్థలకు సానుకూలత తెలిపాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీంతోపాటు రోజు వారి లక్ష్యం మేరకు మట్టి తవ్వకాలు చేయని పక్షంలో ఫెనాల్టీ విధించి, బిల్లుల నుంచి కట్ చేస్తున్నారని అలా చేయొద్దని పట్టుపడుతున్నట్లు తెలిసింది. అలా చేస్తే మిగిలిన ఓసీపీల్లోని కాంట్రాక్ట్ సంస్థలు డీజిల్ బిల్లులు సంస్థనే భరించాలని ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చి అక్కడ ఇవ్వకపోతే కోర్టుకు పోవచ్చు. అప్పుడు మొదటికే మోసం వస్తుందని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్తారు. ఓసీపీలో ఉత్పత్తయ్యే బొగ్గుపైనే ఆధారపడిన ఎస్టీపీపీ వంటి సంస్థల పరిస్థితి ఏంటి? ఈ సంక్షోభాన్ని ఎలా పూరిస్తారన్నది వేచి చూడాలి.
కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెండింగ్
గత నెల 24వ తేదీ నుంచే మట్టి తవ్వకాలు, రవాణాను నిలిపివేసిన సీఆర్ఆర్ సంస్థ నాలుగు నెలలుగా 600 మంది కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. సుమారు రూ.5 కోట్లు కార్మికులకు వేతనాల రూపంలో చెల్లించాలి. దీని కోసం కొంత కాలంగా కార్మికులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీరాంపూర్ ఓసీపీపై దాదాపు 12 గంటలపాటు ధర్నా చేశారు. బొగ్గు రవాణా వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, సింగరేణి ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సోమవారం వేతనాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
సీఆర్ఆర్ సంస్థ జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి బిల్లులు పెట్టలేదని సింగరేణి అధికారులు అంటున్నారు. కార్మికులకు వేతనాలు ఇచ్చినట్లు జూన్ నెల నుంచి బిల్లులు పెట్టలేదని, అవి పెడితేనే బిల్లులు మంజూరు అవుతాయని చెబుతున్నారు. ఇప్పటికే మట్టితవ్వకాలపై చేతులెత్తేసిన సదరు సంస్థ.. పెనాల్టీల రూపంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం అవున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో బిల్లులు రాకుండా కార్మికులకు వేతనాలు చెల్లించడం ప్రశ్నార్థకంగా మారింది.
సంస్థ వద్ద ఉన్న యంత్రాలు, ఉద్యోగులతో ఉత్పత్తికి కృషి..
శ్రీరాంపూర్ ఓసీపీలో ఎదుర వుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సంస్థ వద్ద ఉన్న యం త్ర సామగ్రి, ఉద్యోగు లతో ఉత్పత్తి కొనసా గిస్తాం. ఓసీపీ కాంట్రా క్టు సంస్థతో చర్చలు జరుపుతున్నం. ప్రత్యామ్నా యంగా మూడో టెండర్‌కు డీపీఆర్ పంపించాం. అవసరమైతే మరో టెండర్‌కు ప్రణాళికలు రూపొందించుకుంటాం. సంస్థలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. టెండర్లలో నూతన మార్పులు చేసుకొని కొత్త టెండర్ ప్రకటించడం జరుగుతుంది. ఈ ప్రకియ పూర్తి కావడానికి కనీసంగా మూడు నెలలు పట్టవచ్చు. సంస్థ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి టెండర్లలో మార్పు చేసే ఆలోచనలు చేస్తున్నది.
– జీఎం శ్రీనివాస్, శ్రీరాంపూర్.